Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పవన్‌ కళ్యాణ్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. మూడు పెళ్లిళ్లపై పవన్‌ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని.. మహిళలకు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆయనకు నోటీసులు పంపారు. ఇందులో ఆమె పలు విషయాల్ని ప్రస్తావించారు. పవన్‌ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలు సమాజంలో కలకలం రేపాయని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశం ఇస్తూ పవన్‌ మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్‌కు గురైందని వాసిరెడ్డి పద్మ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్‌ ఎదురుచూసినట్లు తెలిపారు. అయినా పశ్చాత్తాపం కానీ, క్షమాపణలు కానీ లేవన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లి చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేక అంశమేనని, కోట్ల రూపాయలు భరణం ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ ఎలా మాట్లాడతారంటూ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ అభ్యంతరం తెలిపారు. చేతనైతే మీరూ చేసుకోమనడం సరికాదన్నారు. కోట్లు, లక్షలు, వేలు ఇలా ఎవరికి చేతనైతంతగా వారు భరణం ఇస్తూ పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే ఓ మహిళ జీవితానికి భద్రత ఎలా ఉంటుందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఓ సినిమా హీరోగా, పార్టీ అధ్యక్షుడిగా మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా అని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత ఈ వ్యాఖ్యల్ని ఆదర్శంగా తీసుకోరా అని పద్మ ప్రశ్నించారు. పవన్‌ వ్యాఖ్యలపై తమకు ఇప్పటికే చాలా మంది ఫిర్యాదులు చేశారని, ఈ మాటలు అవమానకరంగా, మహిళల భద్రతకు ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. కాబట్టి వెంటనే పవన్‌ కళ్యాణ్‌ తన మాటలపై మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్‌ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img