Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ..ఎత్తేయాలనే ఆలోచనే లేదు
మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇంటింటికీ రేషన్‌ బియ్యం కార్యక్రమాన్ని ఎత్తేస్తున్నట్లు వస్తోన్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు. దీనికి వెనుక టీడీపీ ఉందని ఆరోపించారు. ప్రజల్లో లేనిపోని అపోహలను కల్పించడానికే ఆ పార్టీ నాయకులు పని చేస్త్తున్నారని ధ్వజమెత్తారు.
అదనపు బియ్యం పంపిణీ..
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠపర్చడంలో భాగంగా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టామని, దీన్ని ఎత్తేయాలనే ఆలోచనే లేదని అన్నారు. అర్హత ఉన్న వాళ్లందరికీ రేషన్‌ ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని వివరించారు. కోవిడ్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యాన్ని కూడా 2.68 కోట్ల మందికి పంపిణీ చేస్తోన్నామని బొత్స సత్యనారాయణ, కారుమూరి అన్నారు.రాష్ట్రంలో 4.23 కోట్లు ఉంటే గరిబీ హఠావో కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 2.68 కోట్ల మందికి మాత్రమే బియ్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అదనంగా కోటి 60 లక్షల మందికి బియ్యాన్ని పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అందే ఆహార ధాన్యాలను జనాభాలో 95 శాతం మందికి పంపిణీ చేస్తున్నామని బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు.
కేంద్రం ఇస్తోన్న రేషన్‌ బియ్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని, లబ్ధిదారులకు ఇవ్వడానికి అవసరమైన సిఫారసులను చేయడానికి వైఎస్‌ జగన్‌ మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. అందరికీ బియ్యం అందిస్తున్నామని మంత్రులు చెప్పారు. తమ ప్రభుత్వం ఇస్తోన్న రూపాయి బియ్యం కొనసాగుతోందని స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కింద గతంలో కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని సుమారు కోటి 66 లక్షల మందికి బియ్యం పంపిణీ చేస్తోన్నామని చెప్పారు.
అంత్యోదయ కార్డులు ఉన్న వారికి కూడా బియ్యం ఇవ్వాలని గుర్తించామని పేర్కొన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, రూపాయి బియ్యం అందరికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డోర్‌ డెలీవరి చేస్తామనీ తెలిపారు.తాము ఈ రకంగా పౌర సరఫరాల వ్యవస్థను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటోన్నామని, ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. ఆ ఆదరణను చూసి తట్టుకోలేక టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తోన్నారని, రేషన్‌ షాపులు మూసేస్తామని తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సూచించారు. రూపాయికి కిలో బియ్యం పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img