Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమయ్యారు : చంద్రబాబు

ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్‌ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగానితనమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. వరదలతో చనిపోయిన వారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమయ్యారని, దీనిపై న్యాయ విచారణ జరగాలన్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారన్నారు. బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదన్నారు. ఆయా పంటలకు టీడీపీ హయాంలో చెల్లించిన ఇన్‌ పుట్‌ సబ్సీడీని తగ్గించారని విమర్శించారు. పంట బీమా ప్రీమియం కట్టకుండా జగన్‌ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందడంలేదన్నారు. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారన్నారు. ఓటీఎస్‌ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి.. మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు చర్చిస్తామని చెప్పారు. అభయ హస్తం పథకాన్ని జగన్‌ రెడ్డి నిర్వీర్యం చేశారని, డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారని మండిపడ్డారు. జగన్‌ రెడ్డి విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతిందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. 20 ఏళ్లయినా ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదని, ఉన్మాదంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img