Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీజేపీ కక్ష సాధింపు రాజకీయం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ

విశాలాంధ్ర – విజయవాడ : మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు మానుకోవాలని, విధానాలపై పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హితవు పలికారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించటాన్ని తప్పుబట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా రాహుల్‌గాంధీపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌ గ్యాంగ్‌ మోదీ బంధువులు 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొటి విదేశాలకు పారిపోయారని విమర్శించారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వారిలో 29 మంది గుజరాత్‌ గ్యాంగ్‌ ఉన్నదని తెలిపారు. రాజకీయ పార్టీల మధ్య బీజేపీ వైషమ్యాలు సృష్టిస్తున్నదన్నారు. గవర్నర్‌ వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలు ఎలా ఉండాలో నిర్ణయించాలని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. రాజకీయ ప్రత్యర్ధులపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని చెప్పారు. బీజేపీకి జైకొడితే ఇంటికి…లేకుంటే జైలుకి అన్నట్లు మోదీ వ్యవహరిస్తున్నారని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు సీపీఐ, సీపీఎం ఒక్కతాటిపైకి వచ్చి…బీజేపీపై పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల ఆధారంగా ముందుకెళ్లాలని సూచించారు. ఉత్తరాదిలో మమత, అఖిలేశ్‌ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే జరగాలన్నారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదన్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
జగన్‌ కక్షపూరిత పాలన
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కక్షపూరిత పాలన సాగిస్తున్నారని నారాయణ విమర్శించారు. కర్నూలుకు హైకోర్టు అనేది పసలేని వాదనన్నారు. మూడు రాజధాలు అనేది తప్పుడు నిర్ణయమని, దీనిని సమర్ధించుకోవటం కోసం అనేక తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 141.5 అడుగులుగా నిర్ణయిస్తే ఆ ప్రాజెక్టు ఎందుకూ ఉపయోగపడదని ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యుత్‌ ఉత్పాదన, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యం కాదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన కుమారుడు జగన్‌ ఎలా స్పందిస్తారో వేచిచూడాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామన్నారు. విశాఖలో 30 వేల ఎకరాల భూమి అదానీకి కావాల్సి ఉందని, దాని కోసం స్టీల్‌ప్లాంట్‌ను ముందుగా ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను తుక్కు కింద అమ్మేస్తారని జోస్యం చెప్పారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, కేవీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img