Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మత్స్యసంపద – మృత్యువాత

పాయకరావుపేట(విశాఖ పట్నం జిల్లా) :
అనుమతులు లేని రొయ్యల చెరువులు, పరిశ్రమలతో మత్స్యసంపద మృత్యువాత పడుతోంది. సముద్రతీరం వెంట ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలతో మత్స్యసంపద సర్వనాశనమైపోతుండగా మత్స్యకార గ్రామాల సమీపంలో ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులు, పరిశ్రమల నుంచి విడుదలయే వ్యర్థ, కలుషిత జలాలు కాలువలు, ఉప్పుటేరు, నదుల్లో కలిసిపోతోంది. దీంతో వాటిల్లో గల మత్స్యసంపద అంతరించిపోతోంది. దీంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో 400 ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి అనుమతులు ఉండగా, చాలా చెరువులకు ఎటువంటి అనుమతులు లేవు. రొయ్యల చెరువులు ఏర్పాటు చేసే సమయంలోనే గ్రామాభివృద్ధికి సహకరిస్తామని వాటి యజమానులు నమ్మబలికారు. రొయ్యల చెరువులు ఏర్పాటు చేసుకొని లక్షలు సంపాదిస్తున్నారు. సమీపంలోని నదులు, చెరువులు, కాలువలు, ఉప్పుటేరుల్లో వ్యర్థ, కలుషిత జలాలు విడుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుండి పంపానది ప్రవహిస్తూ మండలంలోని వెంకటనగరం వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో ఉప్పుటేరులో, పంపానదిలో చేపలవేట నిషేధ సమయంలో వేట కొనసాగిస్తారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, సముద్రంలో చేపలవేటకు వెళ్లలేని వారు ఏడాదికాలం చేపలవేట సాగిస్తూ జీవనం గడుపుతుంటారు. ఉప్పుటేరు, పంపానదిపై

ఏడాది పొడువునా రాజవరం, గజపతినగరం, వెంకటనగరం, రాజానగరం, పెంటకోట, రత్నయ్యంపేట గ్రామాలకు చెందిన 450 కుటుంబాల మత్స్యకారులు వేట సాగిస్తుంటారు. అయితే పంపానదిని ఆనుకొని ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులు, పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ జలాల కారణంగా మత్స్యసంపద మృత్యువాత పడి జీవనోపాధి కోల్పోతున్నారు.
భూగర్భ జలాలు కలుషితం
రొయ్యల చెరువులు, పరిశ్రమల కారణంగా వెంకటనగరం, రాజానగరం గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.ూ నీటిని సేవించిన ప్రజలు, పశువులు రోగాల బారిన పడుతున్నారు. సమీప పంట భూములు ఉప్పుతేరి పోతున్నాయి. పంటలు పండక రైతులు నష్టపోతున్నారు. గ్రామ స్మశానమంతా ఊబిలా మారిపోయింది. వాస్తవానికి రొయ్యల చెరువుల వ్యర్థాలను శుద్ధిచేసి మాత్రమే విడుదల చేయాలి. కానీ శుద్ధి చేయకుండా రసాయనాలతో కూడిన వ్యర్థాలను నేరుగా విడుదల చేస్తున్నారు.
ఎటువంటి చర్యలు లేవు : సర్పంచ్‌ వెంకట రమణ
మత్స్యసంపదను నాశనం చేస్తున్న రొయ్యల చెరువులు, పరిశ్రమలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వెంకటనగరం గ్రామ సర్పంచ్‌ వంకా వెంకటరమణ ఆరోపించారు. రొయ్యల చెరువులు, రొయ్యల పరిశ్రమల ఏర్పాటుకు పంచాయతీ, రెవెన్యూ, మత్స్యశాఖ, భూగర్భ జలాలు, కాలుష్య నియంత్రణా మండలి అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అయితే వెంకటనగరం సమీప ప్రాంతంలో ఉన్న రొయ్యల చెరువులకు అనుమతులు లేవని తెలిపారు. రొయ్యల చెరువుల వ్యర్థాలను శుద్ధి చేసి విడుదల చేయాలని తెలిపారు. ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న రొయ్యల చెరువుల యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
చర్యలు తీసుకుంటాం : ఎఫ్‌డీఓ శృతి
అనుమతులు లేని రొయ్యల చెరువులపై చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఓ పి.శృతి తెలిపారు. మండలంలో 400 ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉండగా వీటిలో కొన్నింటికి నిజంగా అనుమతులు లేవని చెప్పారు. రొయ్యల చెరువులు అన్నింటికీ అనుమతులు ఇచ్చే విధంగా ఏపీఎస్‌ఏఆర్‌ఏ చట్టం పరిధిలోకి తీసుకొస్తామన్నారు. కలుషిత వ్యర్థాలు విడుదల కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img