Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మళ్లీ బాలురదే హవా

ఏపీ ఇఏపీసెట్‌`అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల
టాప్‌ 10లో ఐదుగురు తెలంగాణ విద్యార్థులు
92.85 శాతం అభ్యర్థుల అర్హత : మంత్రి ఆదిమూలపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్‌)2021 ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ఫలితాలను ప్రకటించగా, తాజాగా అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలను మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం ప్రకటించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాల్లోనూ బాలురే అత్యధికంగా ర్యాంకులు సాధించారు. టాప్‌ 10 ర్యాంకులను ఏపీకి చెందిన ఐదుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది నమోదు చేసుకోగా, 78,066 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బుధవారం నుంచి వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచుతారు. ఈ ఫలితాల విడుదలలో తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, ఉన్నత విద్యా విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏపీహెచ్‌ఆర్‌ఎంసీ చైర్మన్‌ వి.ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్లు టి.లక్ష్మమ్మ, ప్రొఫెసర్‌ కె.రామ్మోహనరావు, కార్యదర్శి బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌, ప్రత్యేకాధికారి ఎం.సుధీర్‌ పాల్గొన్నారు.
టాపర్లు వీరే :
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్‌కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండవ ర్యాంకును అనంతపురానికి చెందిన ఆర్‌.శ్రీనివాస్‌ కార్తికేయ సాధించారు. మూడో ర్యాంకును తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్‌రావు, నాలుగో ర్యాంకును కూకట్‌పల్లికి చెందిన గజ్జల సమీహనరెడ్డి, ఐదో ర్యాంకు హైదరాబాద్‌ ప్రగతినగర్‌కు చెందిన కాసా లహరి కైవసం చేసుకున్నారు. ఆరో ర్యాంకును గుంటూరుకు చెందిన కె.చైతన్య కృష్ణ, ఏడో ర్యాంకును గోరంట్లకు చెందిన ఎన్‌.దివ్య సాధించారు. ఎనిమిదో ర్యాంకును తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటకు చెందిన కళ్యాణం రాహుల్‌ సిద్ధార్థ్‌, తొమ్మిదో ర్యాంకును నల్గొండ గరిడేపల్లికి చెందిన టి.సాయిరెడ్డి కైవసం చేసుకున్నారు. పదో ర్యాంకును గుంటూరుకు చెందిన గద్దె విదిప్‌ సాధించారు.
ఏడు రోజుల్లో రికార్డు ఫలితాలు : మంత్రి ఆదిమూలపు సురేష్‌
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు రోజుల రికార్డు సమయంలో ఫలితాలను వెల్లడిరచామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ఏపీ ఈఎపీసెట్‌ను అత్యంత పారదర్శకంగా నిర్వహించి, సంబంధిత అధికారులు ప్రతిభ చాటారని అన్నారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలో ఏ ఒక్క విద్యార్థికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img