Friday, April 19, 2024
Friday, April 19, 2024

మూడు రాజధానులపై జగన్‌ మొండిపట్టు వీడాలి

విశాలాంధ్ర-మండపేట: మూడు రాజధానులపై సీఎం జగన్‌ మొండిపట్టు, నియంతృత్వ పోకడలు వీడాలని అమరావతి రైతులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర గురువారం 39వ రోజుకు చేరుకుంది. కేశవరం నుంచి ప్రారంభమైన మహా పాదయాత్రకు మండపేటలో అపూర్వ స్వాగతం లభించింది. వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజక వర్గం నలుమూలల నుంచి రైతులు, టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి అమరావతి రైతుల అడుగుల్లో అడుగులు వేశారు. జడ్‌ మేడపాడు వంతెన మీదుగా పాదయాత్ర అనపర్తి వైపు సాగింది. వెంకటేశ్వర స్వామి చైతన్య రథం, కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. తీన్‌మార్‌ డప్పులు, గారిడీ నృత్యాలు మారుమోగాయి. అమరావతికి మద్దతుగా రైతులు చేసిన నినాదాలు మిన్నంటాయి. గంగిరెద్దులు, ట్రాక్టర్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌, బీజేపీ నాయకుడు కోన సత్యనారాయణ రైతులకు మద్దతుగా నిలిచారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మేడపాడు వంతెన వద్ద అవాంచనీయ సంఘటనలు కలుగకుండా పోలీసులు పహారా కాశారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
అంతిమ విజయం మాదే…
విశాలాంధ్ర-అనపర్తి: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించిన అంతిమ విజయం తమదేనని రైతులు అన్నారు. అమరావతికి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే మహాపాదయాత్రకు పెద్దఎత్తున మద్దతు లభిస్తుందని వారు పేర్కొన్నారు. మహా పాదయాత్ర కేశవరం, జి మేడపాడు మీదుగా అనపర్తి మూడు తూముల వద్దకు గురువారం చేరుకుంది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనపర్తి, పొలమూరు మీదుగా రామవరం వరకు పాదయాత్ర కొనసాగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ్లటీడీపీ జిల్లా అధ్యక్షుడు జవహర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img