Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మోదీపై అన్నివర్గాల్లో వ్యతిరేకత

ప్రచారభేరీలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు

విశాలాంధ్ర నెట్‌వర్క్‌: ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పతనం కావడం తథ్యమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సీపీఐసీపీఎం ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రఛారభేరీ కార్యక్రమం 7వ రోజు రాష్ట్రవ్యాప్తంగా సాగింది. ఇందులో భాగంగా గుంటూరు చాకలికుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్‌ నుంచి సీపీఐ నేత చినపోతుల విజయ్‌ కుమార్‌ అధ్యక్షతన ప్రారంభ మైన పాదయాత్రకు ముఖ్యఅతిథిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ తొమ్మిదేళ్ల పరిపాలన కోట్లకు పడగలెత్తిన కుబేరులకు తప్ప, దేశంలోని సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదన్నారు. రైతులు, కార్మికులు, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనపై విసుగెత్తి ఉన్నారన్నారు. మోదీని ప్రధానమంత్రి ఉద్యోగం నుంచి తప్పించడానికి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తూ దేశంలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా రూపుమాపుతానని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన మోదీ.. ప్రధాని అయ్యాక యువతకు తాను ఇచ్చిన హామీలను తుంగలోతొక్కారన్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే సాధ్యం కాదంటూ... బజ్జీ, పకోడీ బండ్లు నడుపుకుంటూ కూడా జీవనం సాగించవచ్చని యువతకు ఉచిత సలహాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. సీపీఐ, సీపీఎం నగర కార్య దర్శులు కోట మాల్యాద్రి, కె.నళినకాంత్‌, సీపీఐ నాయకులు గని, నూతలపాటి చిన్న, సీపీఎం నాయకులు ముత్యాలరావు, శ్రీనివాసరావు, నికల్సన్‌, ఖాసిం వలి, భాష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విచ్ఛిన్నకర బీజేపీని సాగనంపుదాం: జల్లి విల్సన్‌, ఓబులేసు పిలుపు విచ్ఛిన్నకర విధానాలు అవలంబిస్తున్న బీజేపీని సాగనంపి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు జల్లి విల్సన్‌, జి.ఓబులేసు పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో గురువారం ఉదయం, సాయంత్రం జరిగిన ప్రచార భేరీ కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ తప్ప ఇతర ప్రధానులందరూ ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించా రన్నారు. మోదీ మాత్రం ఒక్క సంస్థను కూడా స్థాపించకుండా ఉన్నవాటిని అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. అదాని ప్రపంచ ఆర్థిక ఉగ్రవాది అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోం దన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌ జాయింట్‌ కమిషన్‌ వేయాలని డిమాండ్‌ చేయటం వల్ల రాహుల్‌ గాంధీని అనర్హుడుగా ప్రకటించారని తెలిపారు. ప్రధాని విద్యార్హతలు ఏమిటో ప్రజలకు చెప్పాలని కోరినందుకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు జరిమానా విధించారని చెప్పారు. దేశంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న విచ్ఛిన్నకర పార్టీ బీజేపీ అని విమర్శించారు. ఏపీలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు మంజూరు, నిర్వాసితులకు పరిహారం చెల్లించటం చేయలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, నిలదీయాల్సిన ప్రతిపక్షం మౌనంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం, నష్టం, మోసం చేస్తున్న బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్‌ వాళ్లు దేశాన్ని దోచుకుంటే నేడు అదాని అంబానీలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ మాయలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పడవద్దని హితవు పలికారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, పెన్మెత్స దుర్గాభవాని, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు దేశ సంపద దోచిపెడుతున్న మోదీ: జంగాల కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. అన్ని కులాలు కలిసి ఉంటున్న భారతదేశంలో మతాల పేరుతో జాతుల పేరుతో ఈ మతతత్వ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను విడగొడుతుందని అన్నారు. మంగళగిరితాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో గురువారం సీపీఐ`సీపీఎం ఆత్మకూరు కమిటీల ఆధ్వర్యంలో ప్రచార భేరీ నిర్వహించారు. జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ బీజేపీ మతతత్వ, కార్పొరేట్‌ కూటమి దుర్నీతిని ప్రశ్నించడానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కార్పొరేట్‌ శక్తులకి దేశ సంపద మొత్తాన్ని దోచిపెట్టడాన్ని ఆయన ఖండిరచారు. ఇద్దరు గుజరాతీలు మోదీ, అమిత్‌ షాలు దేశ సంపదను అమ్ముతుంటే మరో ఇద్దరు గుజరాతీలు అదానీ, అంబానీలు కొనుక్కుంటున్నా రని అన్నారు. ఎక్కడికక్కడ మతకలహాలు, వివాదాలు రేపుతున్న మోదీ ముఠా… ప్రజల మధ్య విద్వేషపు మంటలు సృష్టిస్తున్నా రని, ఈ నేపథ్యంలో ఈ మతోన్మాద బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరపతయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, మండల కార్యదర్శి జాలాది జాన్‌ బాబు, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గజవల్ల వెంకటకృష్ణ, సీపీఎం నాయకులు ఈమని అప్పారావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: డేగా ప్రభాకర్‌
నిత్యావసర ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ విమర్శించారు. ఏలూరు నగరంలోని పోణంగి నుంచి ప్రారంభమైన ప్రచార భేరీ వై.ఎస్‌.ఆర్‌ కాలనీ, మరడాని రంగారావు కాలనీ, జేపి కాలనీ, దక్షిణపు వీధి, వెంకన్న చెరువు, పిచ్చుక గుంట, గడియార స్తంభం, కుండీ సెంటరు ప్రాంతాలలో కొనసాగింది. డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ… మోదీ అధికారంలోకి వచ్చాక కార్పోరేట్‌ కంపెనీల బడా పారిశ్రామిక వేత్తల ఆస్తులు పెరిగాయి కానీ సామాన్యుని జీవన ప్రమాణాలు ఏమాత్రం మెరుగు పడలేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానీ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కానీ అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శిం చారు. రాష్ట్ర ప్రయోజనాలను, అభివృద్ధిని విస్మరించి ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రం ఎదుట సాగిలపడుతున్నారని, ఇటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసే వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, ఏరియా కార్యవర్గ సభ్యురాలు అడ్డగర్ల లక్ష్మి ఇందిర, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు బళ్ళ కనకదుర్గారావు, సాయన బాలు, సీపీఎం నగర కార్యదర్శి పళ్ళెం కిషోర్‌, పి ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img