Friday, April 19, 2024
Friday, April 19, 2024

మోదీ చేతిలో వ్యవస్థలు పతనం

బిల్లులు వ్యతిరేకిస్తే జగన్‌ జైలుకే
వివేక హత్య కేసు నిగ్గు తేల్చాలి
ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహ పున:ప్రతిష్ఠలో నారాయణ

కడప బ్యూరో : మోదీ సర్కారు హయాంలో వ్యవస్థలన్నీ పతనమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో జగన్‌ విఫలమయ్యారన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో బుధవారం కమ్యూనిస్టు యోధుడు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి కాంస్య విగ్రహం పున:ప్రతిష్ఠ కార్యక్రమానికి నారాయణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ విధానాల వల్ల ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. దీనికి తెరవెనుక సూత్రధారి అమిత్‌షాయేనన్నారు. మోదీని సాగనంపేందుకు మమతా బెనర్జీ సహా ప్రధాన పార్టీలన్నిటినీ ఏకం చేస్తున్నామన్నారు. మోదీతో అంటకాగే పార్టీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని నారాయణ హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం సీబీఐ, న్యాయవ్యవస్థ, నీతిఆయోగ్‌ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌కు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం అందులో భాగమేనన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం ప్రథమంగా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలిచిందని, ఆయన సహకారంతో నాటి కడప పార్లమెంట్‌ సభ్యుడు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి పేరును గండికోట జలాశయానికి పెట్టామని నారాయణ గుర్తు చేశారు. ఈశ్వర్‌రెడ్డి ఎన్నికలకు వైఎస్‌ కుటుంబం అన్నిరకాల సహాయంతో పాటు వాహనాలు సమకూర్చేదన్నారు. వైఎస్‌ఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పరిస్థితులు మారాయన్నారు. కేరళ, త్రిపుర, బెంగాల్‌ రాష్ట్రాల్లో వామపక్షాలు అధికారంలో ఉన్న సమయంలోనూ ఏ ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నాయకుల పేర్లు పెట్టలేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో మొదటిసారిగా ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి పేరును గండికోట రిజర్వాయర్‌కు పెట్టడం హర్షణీయమన్నారు. జమ్మలమడుగులో ఈశ్వర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఆయన సోదరుడు, మాజీమంత్రి సి.ఆదినారాయణరెడ్డి కుటుంబం సహకరించిందన్నారు. విగ్రహం ప్రారంభం రోజున తాను, వైఎస్‌ఆర్‌ పాల్గొన్నామని గుర్తు చేశారు.జిల్లాలో అందరికీ నోటిలో నాలుకలా ఉండే మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం బాధాకరమన్నారు. ఈ కేసును సీబీఐ సత్వరమే పరిష్కరించి.. నిందితులను అరెస్ట చేయాలని నారాయణ డిమాండు చేశారు. రాజకీయ వ్యవస్థ చాలా పవిత్రమైనదన్నారు. రాజకీయ వ్యవస్థ లేకుండా ఈ సమాజం ముందుకు సాగడం సాధ్యం కాదన్నారు. ఈశ్వర్‌రెడ్డి విగ్రహ పున:ప్రతిష్ఠకు సహకరించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఈశ్వర్‌రెడ్డి కమ్యూనిస్టు నాయకుడుగా విలువలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈశ్వర్‌రెడ్డి జమ్మలమడుగు వాసి కావడం తనకెంతో ఆనందాన్ని ఇస్తున్నదన్నారు. ఈశ్వర్‌రెడ్డి పేరును మండలానికి పెట్టేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్నారన్నారు.నాడు ఈశ్వర్‌రెడ్డి కృషి వల్ల మైలవరం ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. రాయలసీమ ప్రాంతంలో కొంతమేరకు సాగు, తాగునీరు లభిస్తున్నదంటే అందుకు కమ్యూనిస్టుల ఉద్యమాలే కారణమన్నారు. ఈ ప్రాంతంలో గాలేరునగరి, శ్రీశైలం రిజర్వాయర్‌, సోమశిల, తెలుగుగంగ తదితర ప్రాజెక్టుల ఏర్పాటుకు దారి చూపింది కమ్యూనిస్టు నాయకులని గుర్తు చేశారు. సీపీఐ కడప జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి విలువలకు నిదర్శనంగా నిలిచారన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఈశ్వర్‌రెడ్డి ఆస్తులన్నింటినీ త్యజించి పేద, బడుగు, బలహీనవర్గాల కోసం తుదిశ్వాస వరకు పోరాడారన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. కృష్ణమూర్తి, రామయ్య, ఎల్‌.నాగసుబ్బారెడ్డి, జి.చంద్ర, ఎన్‌.వెంకటశివ, సుబ్రమణ్యం, చంద్రశేఖర్‌, సుబ్బారెడ్డి, బషీరున్నీసా, విజయలక్ష్మీ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img