Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనాలి

. రైతులను ఆదుకోవాలి: ముప్పాళ్ల డిమాండ్‌
. గణపవరం, ఉండి, తణుకులో సీపీఐ బృందం పర్యటన

విశాలాంధ్ర-గణపవరం: అకాలవర్షాలకు దెబ్బతిన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారిందని, కొన్నిచోట్ల మొలక కూడా రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు నాయకత్వంలో సీపీఐ ప్రతినిధి బృందం శనివారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించింది. గణపవరం, ఉండి, తణుకు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించింది. రైతులను ఓదార్చింది. తమకు జరిగిన నష్టాన్ని, కష్టాలను ప్రతినిధి బృందానికి రైతులు చెప్పుకున్నారు. అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయం అందించేందుకు సహకరిస్తామని భరోసా ఇచ్చింది. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యంతో పాటు ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. కోతలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సకాలంలో రైతులకు గోనె సంచులు అందించలేకపోయిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న రైసు మిల్లు యజమానులు తేమ సాకుతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేశారని ఆరోపించారు. కేవలం రూ.1300, రూ.1400 కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ముప్పాళ్ల కోరారు. మరోరెండు రోజుల్లో భారీవర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిందని, అందువల్ల ఈలోపుగానే కల్లాల్లో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతు భరోసా కేంద్రాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయన్నారు. రైతులు మరింత నష్ట పోకుండా అందుబాటులో ఉన్న ధాన్యమంతా ప్రభుత్వమే సేకరించాలని డిమాండ్‌ చేశారు. మిల్లర్లు రైతులు వద్ద నుండి బస్తాకు రూ.150 నుండి రూ.200 వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌బీకేలోనూ తడిసిన ధాన్యానికి క్వింటాకి నాలుగు కేజీల ధాన్యం అదనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించకపోతే సీపీఐ అధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఐ ఉండి మండల కార్యదర్శి కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాం ప్రసాద్‌, నాయకులు సనపల శ్రీనివాస్‌, పూసలపాటి వెంకటరామరాజు, తమరాని శ్రీనివాస్‌, రైతులు ఇర్రింకి చందర్రావు, బొడ్డు కనకం, దాసరి నాగన్న, బైరెడ్డి వెంకట్రావు, దాకి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img