Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రానికి అన్యాయంపై ఐక్య ఉద్యమం

హోదా సాధన సమితి, విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

విశాలాంధ్ర-విశాఖ: ప్రత్యేక హోదా పేరుతో మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎన్‌ లెనిన్‌ బాబు, కె.శివారెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు యాత్ర బుధవారం విశాఖ చేరింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజనులు, నాయకులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడే జరిగిన సభకు ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాంబాబు, డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు రాజు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.నాగరాజు అధ్యక్ష వర్గంగా వ్యవ హరించారు. ఈ చలసాని శ్రీనివాస్‌, లెనిన్‌బాబు, శివారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని, విశాఖకు రైల్వే జోన్‌ ఇవ్వాలని, సెంట్రల్‌ యూనివర్సిటీలకు నిధులు కేటాయిం చాలనే డిమాండ్లతోపాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేస్తూ… అనంతపురం నుంచి ఇచ్చా పురం వరకు సమరయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న మోసాన్ని విద్యార్థులు ప్రజల్లో ఎండగట్టాలని కోరారు. రాష్ట్రంలోని అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, బీజేపీ చేసిన మోసాన్ని ఖండిరచాలన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని లేకపోతే భవిష్యత్తులో ప్రజలు ఈ పార్టీలకు ఘోరీ కడతారని హెచ్చరించారు. రాష్ట్రంపై బీజేపీ కపట ప్రేమ చూపడం ఆపి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ బస్సు యాత్రకు అన్ని పార్టీలు మద్దతు తెలిపి, కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టాలని కోరారు. సామాజిక హక్కుల వేదిక జిల్లా నాయకుడు ఎం పైడిరాజు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. ప్రసన్నకుమార్‌, కార్యదర్శి అశోక్‌ తదితరులు మాట్లాడారు. ఈ యాత్ర కి స్వాగతం పలికి పాల్గొన్న వారిలో విశాఖపట్నం జిల్లా యువజన, విద్యార్థి సంఘాల నాయకులు జి.ఫణింద్ర, ఏఐటీయూసీ నాయకులు ఎస్‌ కె రెహమాన్‌, ఎం.మన్మధరావు, పీ గోవిందు, మధు రెడ్డి, కె.ఎ.రావు, సీఎన్‌ క్షేత్రపాల్‌, ఎం.శ్రీనివాసరావు, సీహెచ్‌ కాసుబాబు తదితరులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img