Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యతో బంగారు భవిత

చదువులకు ప్రభుత్వం పెద్దపీట
మూడేళ్లలో రూ.52,600 కోట్లతో సంస్కరణలు
ప్రజల ఆశీస్సులతో తుదికంటా పోరు:జగన్

విశాలాంధ్రశ్రీకాకుళం: తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, పిల్లల భవిష్యత్‌ కోసం నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా పనిచేస్తోందని, మంచి విద్యతోనే భవిష్యత్‌కు భరోసా కలుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అమ్మఒడి మూడో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్‌ సోమవారం శ్రీకాకుళంలో చేపట్టారు. 202122 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధికూరేలా 42,96,402 మంది తల్లుల బ్యాంకు ఖాతాలలో రూ.6,595 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేకదృష్టి సారించిందని చెప్పారు. బడికి వెళ్లాల్సిన పిల్లలు పనులకు వెళ్లడాన్ని గమనించానని, అందుకే ప్రతీ పాప, బాబు చదువుకునేలా ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. మనిషి తలరాత మార్చేశక్తి ఒక్క చదువుకే ఉందని, నాణ్యమైన విద్యను పిల్లలకు అందిస్తే కుటుంబాలతోపాటు సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతీ ఒక్కరికీ చదువే పెద్ద ఆస్తి అని, చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. విద్యా వ్యవస్థపై చేసే ఖర్చును పవిత్రమైన పెట్టుబడిగా గుర్తించాలన్నారు. నాడునేడుతో కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వ బడుగులు రూపుదిద్దుకున్నాయన్నారు. ప్రతీ బిడ్డ పాఠశాలకు వెళ్లాలని, తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించాలన్న స్వార్థంతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి ప్రారంభించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగంపై రూ.52,600కోట్లు ఖర్చు చేశామని, దీనిపై టీడీపీ విమర్శించడం సిగ్గుచేటన్నారు. విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.8వేలు కోట్లు ఖర్చుచేశామని, టీడీపీ ప్రభుత్వ హయాంలోని బకాయిలను తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. వసతి దీవెన కింద హాస్టళ్ల ఖర్చుల కోసం రూ.3,329కోట్లు చెల్లించామని, విద్యా కానుక కిట్లు కోసం రూ.2,324 కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేస్తే టీడీపీ ప్రభుత్వం రూ.125కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. గోరుముద్ధ పథకానికి రూ.3,200 కోట్లు వెచ్చించామని, టీడీపీ ప్రభుత్వం 8నెలల పాటు వంట వారి జీతాలు, సరుకుల బిల్లులను కూడా ఎగనామం పెట్టిందని ఆరోపించారు. నాడునేడు మొదటి దశలో రూ.4వేలు కోట్లతో 15,715 స్కూళ్లను బాగుచేశామని, రెండోదశలో రూ.8వేల కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టామని, భవిష్యత్‌లో తరగతి గదుల్లో డిజిటల్‌ విద్యా ప్రవేశానికి అనుగుణంగా టీవీలు, డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. 4 నుంచి 10తరగతుల వరకు బైజూస్‌ యాప్‌ ద్వారా వీడియోలు, యానిమేషన్‌ పద్ధతిలో పాఠశాలు చెప్పేందుకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, బైజూస్‌ సంయుక్త భాగస్వామ్యంతో డిజిటల్‌ విద్యావిధానం అమలు చేస్తామని, దీని కోసం సుమారు 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు రూ.12వేలు విలువైన ట్యాబ్‌లను సెప్టెంబరులో అందిస్తామన్నారు. విద్యారంగంపై ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెడితే ఎల్లో మీడియా కక్ష కట్టి ప్రభుత్వంపై చవకబారు రాతలు రాస్తున్నదని, తానెవరికీ భయపడేది లేదని, ప్రజల అండ ఉంటే ఎవరితోనైనా పోరాడతానన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాధ్యత ఉండాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకానికి అర్హతగా 75శాతం హాజరు ఉండాలని నిబంధన పెట్టామన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజాశ్రేయస్సు కోసం రాజీపడేదే లేదన్నారు. ఇప్పటికే తాము 95శాతం హామీలు అమలు చేశామని జగన్‌ చెప్పుకున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ సాయిరాజ్‌, జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లాఠకర్‌, జేసీ విజయ సునీత, జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధిక, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు.
సిక్కోలుపై సీఎం వరాలు:
శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధుల వినతుల మేరకు సీఎం జగన్‌ వరాల జల్లు కురిపించారు. శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియం పనుల కోసం అదనంగా రూ.10కోట్లు మంజూరు చేస్తున్నామని, ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పూర్తికి రూ.69కోట్లు ఇస్తానన్నారు. శ్రీకాకుళం, ఆమదాలవలస రోడ్డు విస్తరణ పనులకు ఇటీవలే ప్రభుత్వం రూ.40కోట్లు మంజూరు చేసిందని, రోడ్డు విస్తరణలో ఇళ్లు, షాపులు, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, పునరావాసం కోసం మరో రూ.18కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నేరడి బ్యారేజీ నిర్మాణం ఆలస్యం కానున్నందున తాత్కాలికంగా గొట్టా బ్యారేజీ నుంచి వంశధార నీటిని మళ్లించి వచ్చే వేసవిలోనే 2.5లక్షల ఆయకట్టుకు రెండో పంటకు నీరు అందించేందుకు ఎత్తిపోతల పథకానికి రూ.120కోట్లు, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి వ్యయం పెరగడంతో సవరించిన అంచనాల మేరకు రూ.855 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే 75శాతం పూర్తి అయిన వంశధార స్టేజ్‌2, ఫేజ్‌2 పనులు సవరించిన అంచనాల ప్రకారం రూ.2,407కోట్లు మంజూరు చేస్తూ పనులు డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. ఉద్ధానం ప్రాంత కిడ్నీ బాధితులకు మంచినీరు ఇవ్వడానికి వంశధార నుంచి సర్ఫేస్‌ నీరు తీసుకువచ్చేందుకు, 807 గ్రామాలు పూర్తిగా బాగు చేసేందుకు రూ.700 కోట్లతో పనులు జరుగుతున్నాయని, దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయని, అదనంగా పాతపట్నంలోని మూడు మండలాలను చేర్చుతూ ఈ పనులకు అదనంగా మరో రూ.248కోట్ల పనులు చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img