Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 3న రాష్ట్రవ్యాప్త రాస్తారోకోలు

మోదీని గద్దె దించుదాం… దేశాన్ని కాపాడుకుందాం
తాడేపల్లిగూడెం బహిరంగ సభలో రామకృష్ణ

విశాలాంధ్ర న్యూస్‌ నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు మే 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. స్థానిక ఎన్‌కే గ్రౌండ్లో సీపీఐ, సీపీఎం ప్రచార భేరి యాత్ర, పశ్చిమ గోదావరి జిల్లా బహిరంగ సభ శుక్రవారం జరిగింది. సీపీఐ, సీపీఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శులు కోనాల భీమారావు, బి.బలరాం అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం స్వార్ధంతో ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేయడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. 9ఏళ్ల మోదీ పరిపాలనలో కార్మిక హక్కులను కాలరాస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ప్రధాని మోదీ…అదానీ, అంబానీలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు. బ్యాంకుల్లో రుణాలు పొంది వాటి ఎగవేతకు పాల్పడిన అదానీ, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు రైల్వేలు, ఎల్‌ఐసీ, విద్యుత్‌, విమానాశ్రయాలు, విశాఖ ఉక్కు లాంటి భారీ ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు. 2014లో రూ.47 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న భారత దేశం 2023లో రూ.150 లక్షల కోట్లకు చేరిందన్నారు. మోదీని గద్దె దించేందుకు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశంలోని 21 లౌకిక పార్టీలు ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో జగన్‌ తుగ్లక్‌ పరిపాలన సాగిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. భారీ మెజారిటీతో గెలిచినా కేసుల భయంతో జగన్‌ సంతోషంగా లేరన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నా రన్నారు. పోలవరానికి నిధుల కోఊ్ణసం కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి జగన్‌దని ఆరోపించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరో బయటపెట్టాలని జగన్‌ను డిమాండ్‌ చేశారు. అభివృద్ధిపై నిలదీస్తే కేసులు, నిర్బంధాలకు గురిచేయడం సరికాదన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌. బాబూరావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తుంటే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాజకీయ స్వలాభం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను వాడుకుంటు న్నాయన్నారు. సీపీఐ, సీపీఎం కార్మికుల హక్కుల కోసం, పరిశ్రమల నిర్మాణం కోసం పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయన్నారు. కార్మికులంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు సభకు స్వాగతం పలికారు. సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు వందన సమర్పణ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, నెక్కంటి సుబ్బారావు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రాయ్‌, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న మోదీని గద్దెదింపుదాం: జల్లి విల్సన్‌
ప్రజా వ్యతిరేక, నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపి కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న మోదీ నుంచి దేశాన్ని కాపాడుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ప్రచార భేరీలో ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం లోకి వచ్చిన నాటినుండి దేశ ప్రజలపైన విపరీతంగా భారాలు మోపారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ రంగాలకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ఆంధ్రులు త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండి పడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రుల పౌరుషాన్ని చవి చూడవలసి వస్తుందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ… రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణానికి సంబంధించి న నిధులు రైల్వే జోన్‌, విభజన చట్టంలోని హామీల అమలు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర హక్కులను సాధించి ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలసి పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ దర్శి సభ్యులు డి.రమాదేవి, జిల్లా కార్యదర్శి గంగయ్య, డివిజన్‌ కార్యదర్శి మణిలాల్‌, సీపీఐ నాయకులు నాగంజానేయులు, జీ బాలాజీ, వేమూరు కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రైతాంగం నడ్డి విరుస్తున్న బీజేపీ:జంగాల
గుంటూరు జిల్లా నవులూరు, చిన్నకాకాని గ్రామాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ ప్రచార భేరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ… పండిరచిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మోదీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ నిత్యవసర వస్తువులు, మందుల ధరలను రోజురోజుకు పెంచుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… ప్రైవేటీకరణ వైపు శరవేగంగా పరుగులు పెడుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా దారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాలను తుంగలో తొక్కిన కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ, జనసేన నోరుమెదపడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీకి అధికార, ప్రతిపక్ష పార్టీలు వంతపాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మండల కార్యదర్శి జాలాది జాన్‌ బాబు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకులు ఎం.రవి, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img