Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సంఘం మరింత బలోపేతం

. అప్పుడే పేదల సమస్యల పరిష్కారం
. పక్కా గృహాలు, సాగు భూముల సాధనకు ఉద్యమించండి
. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్‌లో రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: గ్రామాల్లో పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే… ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం బలోపేతం అవసర మని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. విజయవాడ దాసరి భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరిగింది. దీనికి మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్‌ అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 35 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ జగనన్న కాలనీల్లో పక్కాగృహాలు నిర్మించి ఇవ్వడం లేదన్నారు. తండ్రి పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌…నాడు వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి హయాంలో ఆమోదం పొందిన కోనేరు రంగారావు భూకమిటీ ప్రతిపాదనలను అమలు చేయలేదని, సాగు భూముల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్య మించాలని పిలుపునిచ్చారు. పేదలకు పక్కా గృహాలు నిర్మించుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని, సిమెంట్‌, ఇనుము, ఇసుక సరిపడా ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వలంటీర్ల వ్యవస్థ ఉన్న ప్పటికీ… పాలనాపరంగా గ్రామాల్లో అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైనందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలని, సాగు భూములు పేదలకు పంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఉపాధి హామీతోనే అభివృద్ధి: జల్లి విల్సన్‌
జల్లి విల్సన్‌ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికసంఘం గ్రామ, మండల మహాసభలు చాలా పెద్దఎత్తున జరపాలని, గ్రామాల్లో పేదలతో ప్రదర్శనలు నిర్వహించి ఉపాధిహామీ, పేదల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వివరించాలని కోరారు. దళిత, గిరిజనులనూ సంఘంలో పెద్దసంఖ్యలో చేర్చేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పట్ల మోదీ ప్రభుత్వం కుట్రపూరిత వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీలో పేదల శ్రమ కారణంగా దేశ ఆర్థికాభివృద్ధి కొనసాగుతోందని ఆర్థిక నిపుణులు, మేధావులు చెబుతున్నప్పటికీ మోదీకి చీమకుట్టినట్లు లేదన్నారు. ఉపాధి హామీ రక్షణ కోసం గ్రామగ్రామాన ఉద్యమించాల్సిందేనని పిలుపునిచ్చారు.
సమావేశ తీర్మానాలు…
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ భవిష్యత్‌ కార్యక్ర మాన్ని ప్రవేశపెట్టారు. జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల నిర్మా ణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని, సిమెంటు, ఇనుము, ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమైందని శేఖర్‌ వివరించారు. జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ముందు లబ్ధిదారులతో ధర్నాలు చేయాలని సమావేశం తీర్మానించిందన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, సాగుభూముల అంశాన్ని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించి, పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ మొదటి వారంలో విజయవాడలో రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి…భవిష్యత్‌ కార్యారణను వెల్లడిస్తామన్నారు. ఐదు లక్షల మంది సభ్యులను సంఘంలో చేర్చాలని, గ్రామ, మండల, జిల్లా మహాసభలు పూర్తి చేసి…రాష్ట్ర మహాసభలు మే చివరి వారంలో నిర్వహించాలని, భారీ ప్రదర్శన, బహిరంగసభలు జరపాలని తీర్మానించినట్లు ఆవుల శేఖర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ కార్మికసంఘం నాయకులు సీహెచ్‌ కోటేశ్వరరావు, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బుట్టి రాయప్ప, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు బండి వెంకటేశ్వరరావు, ఆర్‌.వెంకట్రావు, బి.కేశవరెడ్డి, సి.సుబ్రహ్మ ణ్యం, సీహెచ్‌ ప్రభాకర్‌, కాబోతు ఈశ్వరరావు, చిలుకూరు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు కిష్టప్ప, పెద్దయ్య, ఎం.నబీ రసూల్‌, ఉప్పెన నరసింహారావు, బత్తుల వెంకటేశ్వరరావు, నాగులు మీరా, కె.రాధాకృష్ణ, లక్ష్మీ, విజయ, పండుగోల మణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img