Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీజ్‌ చేయడంతో కొన్ని,స్వచ్ఛందంగా మరికొన్ని థియేటర్స్‌ క్లోజ్‌

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే థియేటర్స్‌లో టికెట్స్‌ను అమ్మాలని థియేటర్స్‌ యజమానులకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. పలు జిల్లాల్లో సినిమా హాళ్ళలో తనిఖీలు నిర్వహిస్తూ.. అనేక థియేటర్స్‌ ను మూసివేశారు. మరికొన్ని జిల్లాల్లో తాము థియేటర్స్‌ ను నడపలేమంటూ స్వచ్ఛందంగా మూసివేశారు. కొవిడ్‌ నుంచి బయటపడే తరుణంలో సర్కారు టికెట్ల ధరలు తగ్గించేయడంతో ఆర్థికభారాన్ని మోయలేక తూర్పుగోదావరి జిల్లాలో 45 మంది యజమానులు గురువారం థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 127 సినిమా థియేటర్స్‌ ఉన్నాయి. ఈ మూవీ థియేటర్స్‌ లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తనిఖీలు నిర్వహించారు. దీంతో 14 థియేటర్లు మూతపడ్డాయి. ఒక థియేటర్‌ కు 20 వేల జరిమానా విధించారు. మరోవైపు కృష్ణా జిల్లా లో రెండు థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఇక చిత్తూరు జిల్లాలోని మదనపల్లి డివిజన్‌ లో 37 సినిమా థియేటర్స్‌ లో సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 18 థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా మూసివేశారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4, పుంగనూరులో 3, వి కోట 2, తంబల్లపల్లి రొంపిచర్ల లో ఒక్కో ఒక్కో థియేటర్‌ మూసివేశారు. మరికొన్ని థియేటర్లపై తహసీల్దార్ల నుంచి వచ్చే నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోనున్నామని సబ్‌ కలెక్టర్‌ చెప్పారు. తిరుపతి లోనూ కొన్ని థియేటర్లలో తహశీల్ధార్‌ తనిఖీలు నిర్వహించి.. ఆర్డీఓ కు నివేదికనిచ్చారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఆరు థియేటర్స్‌ ను సీజ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో థియేటర్‌ కి రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. అనంతపురంజిల్లాలో హిందూపురంలో సినిమా థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. అధిక ధరలతో టికెట్ల అమ్మకం, రోజుకి ఎన్ని షో లు వేస్తున్నారనే విషయాలను అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే థియేటర్లను సీజ్‌ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోని అద్దంకి పట్టణంలో విఎన్‌ఎస్‌, మినీ విఎన్‌ఎస్‌ 2 సినిమా థియేటర్లు అనుమతులు లేకుండా ప్రదర్శనలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వెంటనే సినిమా ప్రదర్శనలను ఆపి వేయించారు. ఒంగోలులో గోపి కృష్ణ థియేటర్‌ అనుమతి లేని కారణంగా ప్రదర్శన నిలిపేసిన రెవెన్యూ అధికారులు.
కడప జిల్లాలో మొత్తం 57 ధియేటర్లున్నాయి. అయితే వీటిల్లో 5 ధియేటర్లకు నోటీసులు ఇచ్చారు. టికెట్‌ రేట్లు అధికంగా ఉన్నాయని కంప్లైంట్‌ వచ్చినందున 5 ధియేటర్లకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img