Friday, April 19, 2024
Friday, April 19, 2024

19న సీఎం కార్యాలయం ముట్టడిస్తాం

ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకుల పిలుపు

విశాలాంధ్ర`విజయవాడ (గాంధీనగర్‌) : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్‌ను తక్షణమే రద్దుచేసి పోస్టుల సంఖ్య పెంచి నూతన క్యాలెండర్‌ విడుదల చేయాలని, లేకుంటే ఈనెల 19న తాడేపల్లిలో సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. సమితి అధ్వర్యంలో విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం ధర్నాచౌక్‌లో నిరసన దీక్ష చేపట్టాయి. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరామ్‌ చిన్నబాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కృష్ణాజిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు ఈ.వినోద్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్‌ మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేసే ఉద్యోగ క్యాలెండర్‌ను రద్దు చేయాలని నెల రోజుల నుండి ఆందోళన చేస్తున్నా జగన్‌ ప్రభుత్వం స్పందించడం లేదని నాయకులు విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం కేవలం 10,143 ఉద్యోగాలకు మాత్రమే ప్రకటన విడుదల చేసిందని దుయ్యబట్టారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1, గ్రూపు-2 పోస్టులు కేవలం 36 మాత్రమే ప్రకటించి నిరుద్యోగులను తీవ్రంగా మోసగించిందని జగన్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఖాళీ పోస్టులపై జగన్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రెండున్నర లక్షల మంది వలంటీర్లను ఉద్యోగస్తులుగా చూపడం జగన్‌ ప్రభుత్వ కపటనీతికి అద్దం పడుతుందన్నారు. 19న చలో తాడేపల్లికి నిరుద్యోగులు తరలివచ్చి సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేస్తారని తెలిపారు. దీక్షకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి అధ్యక్షత వహించారు. దీక్షలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మోతుకూరి అరుణ్‌ కుమార్‌, ఎస్‌.రామ్మోహన్‌, చెరుకూరి సాయి, రాజేష్‌, సోమేశ్వరరావు, జాన్సన్‌ బాబు, అరుణ్‌, భూషణం, విజయ్‌, శ్రీనివాస్‌, మహర్షి, సాయి తదితరులు కూర్చున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img