ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఈరోజు (శనివారం) ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనున్నది. సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్ఠతను నిపుణులు అధ్యయనం చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం జరిగింది. అయితే గత వైసీపీ సర్కార్ ఐదేళ్లుగా ఆ నిర్మాణ పనులను పట్టించుకోలేదు. దీంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ తదితర నిర్మాణాలు నీటిలో నానుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై ఐఐటీ ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (శుక్రవారం) హైదరాబాద్ ఐఐటీ నిపుణులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలు పరిశీలించారు. ఈరోజు కూడా రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలను పరిశీలించనున్నారు. కాగా ఈ రోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం .. ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్ఠతను పరిశీలించనుంది. సీఆర్డీఏ అధికారులతో కలిసి వీరు నిర్మాణాలను పరిశీలిస్తారు. తర్వాత ఈ రెండు బృందాలు ప్రభుత్వానికి నివేదికను అందించనున్నాయి.