ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ తుది దశకు చేరుకున్నాయి. దీంతో అటు ప్రభుత్వంలో, ఇటు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. జనవరి 31వ తేదీ నాడే ఈ పిటీషన్లు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ.. అందులో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో ఇవాళ అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఈ రోజు విచారణ కొనసాగనుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇక హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను మంగళవారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కేంద్రం తన వెర్షన్ చెప్పాలంటూ సుప్రీం కోర్టు సమయం ఇవ్వగా, అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిరదంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మూడువైపుల నుంచి మూడు రకాల వెర్షన్స్ నేపథ్యంలో నేడు చేపట్టే విచారణ కీలక కాబోతోంది. తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించాల్సి ఉంది. గతంలో చేపట్టిన విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని ఇదివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవసరమని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.