Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఎన్‌సీటీఈ డిప్యూటీ సెక్రటరీపై ఏపీ హైకోర్టు సీరియస్..

నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి డిప్యూటీ సెక్రటరీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరుకాకపోవడంపై సీరియస్‌గా స్పందించింది. ఆయన హాజరు మినహాయింపు కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ బీఈడీ కళాశాల గుర్తింపును రద్దుకు సంబంధించి పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు డిప్యూటీ సెక్రటరీపై వారెంట్ జారీ చేసింది.

ఏపీ హైకోర్టు ఎన్‌సీటీఈ (జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి) డిప్యూటీ సెక్రటరీపై సీరియస్‌ అయ్యింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తమ బీఈడీ కళాశాల గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆ కాలేజీ ప్రిన్సిపల్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌సీటీఈ ప్రాంతీయ డైరెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలేట్‌ అథారిటీ అయిన డిప్యూటీ సెక్రటరీ దగ్గర కూడా అప్పీల్‌ దాఖలు చేశానన్నారు. గత నెల 18న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఎన్‌సీటీఈ ముందు ఆన్‌లైన్‌లో అప్పీల్‌ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు. అధికారులిచ్చిన నోటీసులకు తాము ఇచ్చిన వివరణను పట్టించుకోలేదని.. ఏడాది తర్వాత గుర్తింపును రద్దు చేశారని లాయర్ వాదనలు వినిపించారు. నోటీసులు ఇవ్వడం తప్ప ఆ కాలేజీ యాజమాన్యం ఇచ్చిన వివరణను అధికారులు పట్టించుకోకపోవడాన్ని న్యాయమూర్తి ఆక్షేపించారు. అప్పీల్‌ దాఖలు చేశామని కాలేజీ ప్రిన్సిపల్ సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచారు. అందుకు భిన్నంగా తమ దగ్గర అప్పీల్‌ దాఖలు చేయలేదని.. అది పెండింగ్‌లో లేదని ఎన్‌సీటీఈ డిప్యూటీ సెక్రటరీ తరఫు లాయర్ రాతపూర్వక వివరాల్ని కోర్టుకు సమర్పించడంపై జడ్జి అసహనం వ్యక్తంచేశారు. ఈనెల 18 (శుక్రవారం)న స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఎన్‌సీటీఈ డిప్యూటీ సెక్రటరీని ఆదేశించారు. డిప్యూటీ సెక్రటరీ శుక్రవారం విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోరతూ అనుబంధ పిటిషన్‌ వేయడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పిటిషన్‌ను కొట్టేశారు. విచారణకు రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img