వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై గుడివాడలో జనసైనికులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఆదివారం గుడివాడలోని తోట శివాజీ ఇంటికి పేర్ని నాని వచ్చారు. ఆయన వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు అక్కడకు వచ్చి… ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పేర్ని నాని స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన జనసైనికులు ఆయనపై కోడిగుడ్లు విసిరారు. పేర్ని నానికి కొందరు చెప్పులు కూడా చూపించారు. చెప్పులు చూపించిన వారిలో మహిళలు కూడా ఉండటం గమనార్హం. గతంలో పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పేర్ని నాని రెండు చెప్పులు చూపించారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నానిపై జనసైనికులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మరికొందరు ఆయన వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తోట శివాజి ఇంటి వద్దకు వచ్చి పలువురు జనసైనికులను అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు తనపై జరిగిన దాడిపై పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, గుడివాడ జనసేన నాయకులపై మచిలీపట్నంలో జీరో ఎఫ్ఐఆర్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.