Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేరస్తులకు అండగా సీఎం

. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు
శ్రీ మూడేళ్లలో మహిళలపై దాడులు పెరిగాయి
. జాతీయ మహిళా కమిషన్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం
. మహిళా అఖిలపక్ష నాయకులు

విశాలాంధ్ర`విజయవాడ: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వంటివారిపై చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరస్తులకు అండగా నిలుస్తున్నారని అఖిలపక్ష మహిళా నాయకులు ఆరోపించారు. ఎంపీ గోరంట్లమాధవ్‌పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు మూడేళ్లుగా మహిళలపై అత్యాచారాలు, దాడులను నిరసిస్తూ ఏపీ మహిళా అఖిలపక్షం అధ్వర్యంలో విజయవాడ హోటల్‌ స్వర్ణా ప్యాలెస్‌లో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, జనసేన, లోక్‌సత్తా, వివిధ మహిళా సంఘాల నాయకులు పాల్గొని వైసీపీ పాలనలో మహిళలపై దాడులను ముక్తకంఠంతో ఖండిరచారు. మాధవ్‌ వంటి వారిపై చర్యలు తీసుకోకుండా సీఎం అండగా నిలుస్తున్నారని, దీనిపై దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం, మహిళా ఎంపీలు, జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ… ఎంపీ గోరంట్ల మాధవ్‌ బూతు వీడియో బాగోతం బయటపడి రోజులు గడుస్తున్నా నేటికీ చర్యలు తీసుకోకుండా ఫోరెన్సిక్‌ నివేదిక పేరుతో వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ మాట్లాడుతూ… మహిళలకు కష్టమొస్తే గన్ను కంటే ముందు జగనన్న వస్తారని చెప్పుకున్నారని, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మూడేళ్లుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న విపక్షాలపై ముందూ వెనకా చూడకుండా అకారణంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే నికృష్ట వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా అతన్ని రక్షించడం దుర్మార్గపు చర్య కాదా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ… ప్రజా ప్రతినిధిననే విషయం మరిచి అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించిన గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకపోగా, అది ఆయన ప్రైవేటు వ్యవహారమని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బొల్లినేని కీర్తి, జనసేన నాయకురాలు రావి సౌజన్య, లోక్‌సత్తా నాయకురాలు నార్ల మాలతి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించలేని, శాంతిభద్రతలను పర్యవేక్షించలేని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img