Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పోలవరం పూర్తిలో ప్రభుత్వం విఫలం


అక్కినేని వనజ విమర్శ
విశాలాంధ్ర-చల్లపల్లి: పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. సీపీఐ కృష్ణా జిల్లా సమితి సమావేశం స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో శుక్రవారం జరిగింది. అక్కినేని వనజ మాట్లాడుతూ విభజన హామీల అమలు కోసం కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికిన జగన్‌..అధికారంలోకి వచ్చాక మోదీ, అమిత్‌షాలకు మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. తాగు, సాగునీరు అందించే బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిచేయలేక పోయిందని, వైసీపీ ప్రభుత్వం సైతం అదేదారిలో నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ మతతత్వ పోకడలను తూర్పారబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. రక్షణశాఖలోనూ ప్రైవేటు వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. నౌకా, విమానశ్రయాలను అదానీ, అంబానీలకు కట్టబెడుతోందని ఆగ్రహం వెలిబుచ్చారు. లౌకిక దేశంలో మతోన్మాదం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. జీఎస్‌టీతో అన్నివర్గాలపై మోయలేని భారం మోపుతోందని విమర్శించారు. దేశంలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కమ్యూనిస్టు పార్టీగా మనం బలపడాలని, లౌకికశక్తులను కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. మోటార్లకు మీటర్లు బిగించే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అక్టోబర్‌ 14న జరిగే సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.1974 తరువాత జాతీయమహాసభలు విజయవాడలో జరుగుతున్నాయని, కృష్ణాజిల్లా నుండి పెద్దసంఖ్యలో కార్యకర్తలు మహాసభలకు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. మహాసభలకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.తాతయ్య, దగాని సంగీతరావు, హనుమానుల సురేంద్రనాథ్‌ బెనర్జీ, లింగం ఫిలిప్‌, మేరుగు విజయ్‌ కుమార్‌, మలుపెద్ది రత్నకుమారి, ఆహ్వానితులు మాలెంపాటి కాంచనరావు, మోదుమూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img