Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఉద్యమాలతో ప్రభుత్వాల మెడలు వంచాలి

కనిగిరిలో ర్యాలీ, బహిరంగసభ
నెల్లూరులో బహిరంగసభ

విశాలాంధ్రఒంగోలు: ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను చట్టసభలలో చర్చించిన నాడే అన్నదాతల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందుకోసం రైతాంగం... ఉద్యమాల ద్వారా ప్రభుత్వాల మెడలు వంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు. ‘దేశాన్ని రక్షించండిరాష్ట్రాన్ని కాపాడండి’ నినాదంతో సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర సోమవారం ఒంగోలులో ప్రవేశించింది. ఈ సందర్భంగా మల్లయ్య లింగం భవనంలో రైతాంగ సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ… 2024 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్ధానం చేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం… ఆచరణలో ఘోరంగా విఫలమైందన్నారు. కనీసం రైతుల ఆత్మహత్యలను కూడా నివారించలేదని ధ్వజమెత్తారు. సారవంతమైన భూమి ఉండి, పుష్కలంగా నీరు లభించే ప్రాంతాలలోనే వ్యవసాయం గిట్టుబాటు గాక రైతులు అల్లాడుతున్నారన్నారు. అదే నీరు సక్రమంగా అందని ప్రాంతాలలో రైతాంగ పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వాలు స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేసి ఉంటే వ్యవసాయ రంగానికి నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదని చెప్పారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు… రైతుల సమస్యలను తమ సమస్యలుగా భావించిన నాడే వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ.2 కోట్లతో గేటు పెట్టించలేని పరిస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గేటు నిర్మించేందుకు ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ప్రభుత్వంపై నమ్మకం లేక ముందుకు రాకపోవడం జగన్‌ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమీషన్‌ ఏజెంట్‌గా మారారని విమర్శించారు. రాష్ట్రంలో విజయవంతమైన అనేక పాల డైరీలు ఉన్నప్పటికీ, గుజరాత్‌ కు చెందిన అమూల్‌ ని తీసుకువచ్చి లీజుల పేరుతో పాల డైరీల ఆస్తులను అప్పనంగా అప్పగించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వాలకు అధికారం ఇచ్చేది దోచుకోవటానికి కాదని హితవు పలికారు. రాష్ట్రంలో, దేశంలో ఏ రాజకీయ పార్టీకి బీజేపీ ప్రభుత్వ విధానాలపై సానుకూలత లేదని, మోదీ పాలనను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఫెయిల్యూర్‌ ప్రధానిగా ఈపాటికే ముద్రపడిరదన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని గండికోట ప్రాజెక్టులో నాలుగేళ్లుగా 26 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. దీనికి కారణం కాలువలు తవ్వకపోవడమేనని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించటాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుందన్నారు. దీనిపై భవిష్యత్తులో రైతాంగం చేసే అన్ని పోరాటాలలో సీపీఐ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రైతాంగ ఉద్యమాలలో సీపీఐ ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడంతో పాటు సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. దిల్లీ, అమరావతి సుదీర్ఘ రైతాంగ పోరాటాలు దేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీ కృష్ణయ్య మాట్లాడుతూ గత 9 ఏళ్ల బీజేపీ పాలనలో నాలుగు లక్షల మంది గ్రామీణులు వ్యవసాయం గిట్టుబాటు గాక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఏటా దేశవ్యాప్తంగా కార్పొరేట్లు, వ్యాపారులు రూ.2 లక్షల కోట్ల దేశ రైతాంగ ఆదాయాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. మోదీ సర్కారు కార్పొరేట్‌ శక్తులకు, బడా వ్యాపారులకు రూ.2.58 లక్షల కోట్ల మేర రాయితీలు ఇచ్చిందని, రూ.15.42 లక్షల కోట్ల మేర పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ శక్తులు చెల్లించాల్సిన పన్నులను రద్దు చేసిందని తెలిపారు. అయితే దేశానికి అన్నం పెట్టే 65% మందిగా ఉన్న రైతాంగ రుణాలు రూ.4.50 లక్షల కోట్లు మాఫీ చేసేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు నవంబర్‌ 27న 500 పైగా ఉన్న రైతు సంఘాల అధ్వర్యంలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు రైతు జిల్లా నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ, కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గ్రానైట్‌ మాఫియాల ద్వారా రాష్ట్ర సంపదను వైసీపీ నేతలకు అప్పగించడమే పనిగా పెట్టుకుని జగన్‌ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ పాలనకు వ్యతిరేకంగా సీపీఐ నిర్వహిస్తున్న పోరాటాలకు పూర్తిస్థాయిలో ఉంటుందని హామీ ఇచ్చారు. రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌.కోటిరెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా రైతాంగం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు నిర్వహించి పాలకులను సమస్యలపై ప్రశ్నించాలన్నారు. ప్రతి ఏడాది పంటల సాగుకు 20 శాతం పెట్టుబడులు పెరుగుతుంటే, ప్రభుత్వాలు మాత్రం కేవలం ఐదు శాతం మాత్రమే గిట్టుబాటు ధరలు పెంచుతున్నారన్నారు. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని చెప్పారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. మేధావుల ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలకు పంటల గిట్టుబాటు ధరలపై సరైన అవగాహన లేదన్నారు. రూ. 1200 కోట్ల విలువచేసే ఒంగోలు డైరీ ని అమూల్‌ కు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. డైరీకి చెందిన 70 ఎకరాల పొలం… జిల్లాలోని పాల రైతులు ఇచ్చిన నగదు అభివృద్ధి ఫలం అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ భూములను, అసైన్డ్‌ భూములను వైసీపీ నేతలకు అప్పగించడమే రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆచార్య రంగా కిసాన్‌ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ పంటలను మార్కెటింగ్‌ చేసుకునే అవగాహన లేని కారణంగానే రైతులు భారీగా నష్టపోవడంతో పాటు, మోసాలకు గురవుతున్నారన్నారు. జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగు భూమిలో కేవలం 11 శాతం భూమిలో మాత్రమే ఈ ఏడాది సాగు జరిగిందన్నారు. రైతాంగాని వ్యవసాయాన్ని రక్షించు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రభుత్వాలు మెడలు ఉంచి తమ డిమాండ్లను సాధించుకోవాల్సిన బాధ్యత రైతాంగం పై ఉందని తెలిపారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు దేవరపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతాంగ శ్వేదం నుంచి అభివృద్ధి చెందిన ఒంగోలు డైలీ ఆస్తులను లీజుల పేరుతో ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. జిల్లాలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్యాకేజ్‌ ఏమైందో తెలియటం లేదన్నారు. వ్యవసాయం, రైతాంగం అభివృద్ధి చెందాలంటే స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించడంతోపాటుగా వాటిని చట్టబద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ ఈశ్వరయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జమలయ్య, సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రావు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే హనుమా రెడ్డి, జామాయిల్‌ సుబాబుల్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే వీరారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్చూరు రాజేంద్ర, నక్కీ లెనిన్‌ బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీ జాన్సన్‌బాబు, శివారెడ్డి, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, సీపీఐ ఒంగోలు నగర కార్యదర్శి పీవీఆర్‌ చౌదరి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img