Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఏఐడీఆర్‌ఎం జాతీయ సమితి సమావేశాలను విజయవంతం చేద్దాం

సన్నాహక సమావేశంలో జల్లి విల్సన్‌ పిలుపు

విశాలాంధ్ర – విజయవాడ: అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం(ఏఐడీఆర్‌ఎం) జాతీయ సమితి సమావేశాలు ఆగస్టు 5, 6 తేదీలలో విజయవాడలో జరగనున్నాయని, జాతీయ నాయకత్వం నిర్ధేశించే కార్యక్రమాల అమలుకు దళిత శ్రేణులు సంసిద్ధులు కావాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పిలుపునిచ్చారు. ఏఐడీఆర్‌ఎం సమావేశాలు విజయవాడలో జరగను న్నందున దాసరి భవన్‌లో శుక్రవారం దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర కార్యవర్గ సన్నాహక సమావేశం జరిగింది. డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జల్లి విల్సన్‌ మాట్లాడుతూ మోదీ పాలనలో దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. అత్యాచార నిరోధక చట్టాలను నీరుగారుస్తున్నారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తోందన్నారు. ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా రిజర్వేషన్లు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ప్రమోషన్లలో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగించడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల సమస్యలను చర్చించి దేశవ్యాప్త కార్యాచరణకు దిగాలని జల్లి విల్సన్‌ స్పష్టం చేశారు. ఏఐడీఆర్‌ఎం జాతీయ అధ్యక్షుడు ఎ.రామూర్తి(పుదుచ్చేరి), జాతీయ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ నిర్మల్‌(ఉత్తరప్రదేశ్‌) సహా అనేక మంది జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ గత సమావేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యకలాపాలను వివరించారు. ఏఐడీఆర్‌ఎం జాతీయ సమితి సమావేశాల సందర్భంగా ఆగస్టు 5న ప్రెస్‌క్లబ్‌లో దళిత సమస్యలపై సెమినార్‌ జరుగు తుందన్నారు. సామాజిక, ఆర్థిక వివక్షపై డీహెచ్‌పీఎస్‌ అలుపెరుగని పోరాటాలు కొనసాగిస్తోందని ఉద్ఘాటించారు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బుట్టి రాయప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.నాగరాజు, ఆర్‌.గురుదాస్‌, కళింగ లక్ష్మణరావు, ఎడ్ల గోసి, సంగుల పేరయ్య, కొడాలి ఆనందరావు, మునెయ్య, సునీల్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img