
. రాయచోటిలో కదం తొక్కిన గిరిజనులు
. రాష్ట్ర స్థాయి మహాసభ విజయవంతం
విశాలాంధ్ర – రాయచోటి/సుండుపల్లి: గిరిజనుల ఐకమత్యం, అభివృద్ధి కోసం గళం విప్పి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన మహాసభ విజయవంతంగా ముగిసింది. అన్నమయ్య జిల్లా గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ నాయక్ సారథ్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మహాసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. చెయ్యి చెయ్యి కలిపి అడుగులో అడుగేసి వేలాది గొంతులు ఒక్కటై సభను దిగ్విజయంగా ముగించారు. మణిపూర్‌లో జరిగిన ఘటనల్లో అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, విప్లవ గాయని విమలక్క మాట్లాడుతూ అందరూ ఒక్కటై మన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. అటవీ హక్కు చట్టం ప్రకారం మన హక్కులను సాధించేందుకు ఈ పోరాటం జరుగుతోందని తెలిపారు. అడవి మనదే, అటవీ భూములు మనవే అనే విషయాన్ని గుర్తించుకుని ఆ భూములను కాపాడుకోవాలని కోరారు. అటవీ భూమి హక్కు చట్టం ప్రకారం గిరిజనులు అటవీ భూములను స్వాధీనం చేసుకొని వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు నరేంద్ర మోదీ ముందు మోకరిల్లారని, అలాంటివారికి రాష్ట్రంలో పాలించే హక్కు లేదని వారు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ నాయక్ మాట్లాడుతూ ప్రముఖ గాయని విమలక్కకు, వారి బృందానికి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గిరిజన సంఘ నాయకులకు, అన్నమయ్య జిల్లా గిరిజన ప్రజలకు, సీపీఐ అన్నమయ్య జిల్లా బృందానికి, కళాకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్ర నాయక్, పెంచలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్.నరసింహులు, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు మన్మధరావు, రాముడు, సత్యనారాయణ, లంబాడా సంఘం జాతీయ నాయకులు శంకర్ నాయక్, సీపీఐ నాయకులు మహేష్, శ్రీనివాసులు, గిరిజన నాయకుడు అమృనాయక్ తదితరులు పాల్గొన్నారు.