ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. టీడీపీ గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన అమరావతి మెట్రో రైల్ ఎండీగా పనిచేశారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు నివేదికల తయారీ, వాటిని కేంద్ర పరిశీలనకు పంపడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రాజెక్టు దాదాపు పట్టాలెక్కే సమయంలో టీడీపీ అధికారం కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో 31 మే 2021న రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా, మరోమారు ఆయనను అదే పదవిలో నియమించింది. కాగా, ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేఎం రావును ప్రభుత్వం రిలీవ్ చేసింది.