Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సెషన్ మొత్తానికి హాజరు కావొద్దని నిర్ణయించింది. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు, సభలో ఆందోళన చేసినా చంద్రబాబు అరెస్టుపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనుమతించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా తరలివెళ్లారు. శాసన సభలో ఉదయం నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ నిర్వహించాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనను సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు.

స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లు మీడియాతో మాట్లాడారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ తమను అవమానించారని, యూజ్ లెస్ ఫెలోస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరిపించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినా స్పీకర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడితే మీరు కూర్చోండి.. మా మాట వినండి అంటూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అంటున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img