విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనలో బాధితులు ఆందోళనకు దిగారు. మత్స్యకార నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఫిషింగ్ హార్బర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సాయంత్రంలోపు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి తమకు న్యాయం చేయాలన్నారు. బోటుకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.
మరోవైపు ఈ ఘటనలో 40కిపైగా బోట్లు దగ్థమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలపైనా అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు.
విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి మంత్రి అప్పలరాజు బయల్దేరి వెళ్లారు.
ఈ ఘటనపై నారా లోకేష్ స్పందించారు. విశాఖ షిప్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40బోట్లు, కోట్లాదిరూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించింది. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్దమనసుతో స్పందించి వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీటిపై ఆధారపడ్డ మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలని.. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి, పటిష్ట చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.