
కష్టజీవుల పెన్నిధి బీకేఎంయూ
జల్లి విల్సన్, ఆవుల శేఖర్
విశాలాంధ్ర – ఉండి : పేదలకు సాగు భూముల పట్టాల కోసం ఐక్య పోరాటాలు అవశ్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు. కష్టజీవుల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం అనేక పోరాటాలు చేశాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమగోదావరి జిల్లా 25వ మహాసభ ఉండిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సోమవారం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సనపల శ్రీను, ఉల్లింకల జయకృష్ణ, సీహెచ్ సరోజిని అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జల్లి విల్సన్ మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా భూస్వాముల చేతిలో చిక్కుకున్న లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసిన ఘనత బీకేఎంయూ, సీపీఐదేనన్నారు. అటవీ, బంజర, రెవెన్యూ, సముద్ర తీర భూములను పేదలకు పంపిణీ కోసం సాగించిన అనేక పోరాటాల ఫలితంగా నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోనేరు రంగారావు అధ్వర్యంలో కమిటీ వేశారని గుర్తుచేశారు. పేదవాడి చేతిలో భూమి ఉంటేనే ఆహార ఉత్పత్తి పెరుగుతుందని, దీనిద్వారా వ్యవసాయ కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో సంక్షేమ పథకాల ముసుగులో ఇళ్ల స్థలాల కోసం దళితులు అనాదిగా సాగు చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా లాక్కోవడాన్ని జల్లి విల్సన్ తప్పుబట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. భీమవరం, ఉండి, కాళ్ళ మండలాలలో వేలాది ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టడం కోసం అద్వితీయ పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై వ్యవసాయ కార్మికులు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 24, 25, 26 తేదీలలో బాపట్లలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభకు జిల్లా నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలు తరలివచ్చి…జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంగా రూపుదాల్సిందన్నారు. ఉపాధి హామీ అమలు జరిగిన తర్వాత వ్యవసాయ కూలీల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 పని దినాలు కల్పించి రోజుకి రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాలలో మెరుగైన వసతులు కల్పించాలని, రెండు పూటలా ఫొటోలు తీసే విధానాన్ని ఉపసంహరించాలన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మణిపూర్ ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రోత్సాహంతోనే మారణకాండ కొనసాగుతోందని ఆరోపించారు. సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల కూలి పెరుగుదల, సాగు భూములకు పట్టాల కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వంక సత్యనారాయణ, నాగిడి సాంబమూర్తి, కొండ్రు సుబ్బారావుతోపాటు అనేకమంది పోరాటాలు చేశారని గుర్తుచేశారు. పేదల చేతుల్లో భూములు ఉంటే ఆర్థికంగా బలపడి జీవితాలు మెరుగుపడతాయన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 86 సంవత్సరాలుగా అనేక భూ పోరాటాలు చేసి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన చరిత్ర మన సంఘానిదేనన్నారు. రెవెన్యూ పోరంబోకు, అటవీ బంజరు భూములు, వన సంరక్షణ సమితులు పంపిణీ చేయడంలో చేసిన కృషి అద్వితీయమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, బీకేఎంయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు తదితరులు ప్రసంగించారు. గంజి రాజు, కోన గొల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.