Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఇవేమి చర్చలు?

. విద్యుత్‌ ఉద్యోగులలో ప్రభుత్వం చీలిక
. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు విమర్శ

విశాలాంధ్ర-విజయవాడ(చిట్టినగర్‌): విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫల మయ్యాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు చెప్పారు. అంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ అధ్వర్యంలో హనుమాన్‌పేట దాసరి భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఓబులేసు మాట్లాడారు. విద్యుత్‌ రంగ ఉద్యోగులు రెండు జేఏసీలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఓబులేసు తెలిపారు. సమస్యలపై విడివిడిగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి, కార్మికశాఖకు డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పవరు జేఏసీ సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించిందని, దానికి స్ట్రగుల్‌ కమిటీ తరపున మద్దతునిస్తూ బహిరంగ ప్రకటన చేశామని, నేటికీ దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం పవరు జేఏసీ కమిటీతో మాత్రమే చర్చలు జరిపి… బుధవారం రాత్రి 11 గంటల తర్వాత చర్చలు సఫలమని ప్రకటించిందన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లు పెద్దగా పరిష్కరించిన పరిస్థితి లేదన్నారు. మూడు డీఏలు ఇవ్వాల్సివుండగా ఒకటి ఇస్తామని, అందులోనూ బకాయిలు 12 విడతలుగా ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఫిట్‌మెంట్‌ 45 శాతం అడగగా 8 శాతానికే ప్రభుత్వం అంగీకరిం చిందని, మాస్టర్‌ పీస్కేల్‌ కింద రూ.2.60 వేలు ఇచ్చారని, దీనివల్ల ఒక్కొక్కరికి రూ.40 వేల నుండి రూ.50 వేల వరకు నష్టం వస్తుందని, దీనిని ఇంజినీరింగ్‌ సెక్షన్‌ విభేదించి…చర్చలను బహిష్కరించదని వివరించారు. ఈ చర్చల క్రమాన్ని గమనిస్తే గూడుపుఠాణి జరిగినట్లు కనబడతోందన్నారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద మనిషిగా కనిపించినా… లోపల బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం, యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై ఉద్యోగులు ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ట్రాన్స్‌కో, జన్‌కో, డిస్కంలలో అరవై వేలమంది శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, ఇంజినీర్లు పని చేస్తున్నారన్నారు. రెండు జేఏసీలతో కాకుండా ఒక జేఏసీతో తూతూమంత్రంగా చర్చలు జరిపి ముగించటం సరికాదని స్పష్టంచేశారు. మరో జేఏసీతో కూడా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు 2018 నాటి పీఆర్‌సీ ప్రకారం రెండు శాతం పెంచి ఇస్తామనటం అన్యాయ మన్నారు. తెలంగాణలో 2022 పీఆర్‌సీ ప్రకారం కాంట్రాక్ట్‌ కార్మికులకు జీతాలు బాగా పెంచారని గుర్తుచేశారు. తాము క్రమబద్ధీకరణ కోసం డిమాండ్‌ చేస్తుంటే కనీసం జీతాలు కూడా పెంచకపోవడం దుర్మార్గమని, యాజమాన్యం పట్టించు కోకపోవడం అన్యాయమన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై స్ట్రగుల్‌ కమిటీ చర్చించి…నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతం తాము ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగి స్తామన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ విద్యుత్‌ రంగ సమస్యలపై మంత్రి సమక్షంలో జరిగిన ఒప్పందాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా మన్నారు. జేఏసీలో కొంతమంది నాయకులను లొంగ దీసుకుని ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఆరోపించారు. నిరవధిక సమ్మె తేదీపై చర్చించి నిర్ణయం తీసుకుంటా మన్నారు. యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కొంతమందిని లొంగదీసుకొని చర్చలు జరపడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, నాయకులు నూర్‌ అహ్మద్‌, విద్యుత్‌ స్ట్రగుల్‌ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img