శ్రీ చైతన్యలో అట్టహాసంగా స్పోర్ట్స్ డే వేడుకలు
విశాలాంధ్ర -రాజంపేట: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ స్పోర్ట్స్ దినోత్సవం సందర్భంగా భువనగిరి పల్లి ఆర్చి వద్ద ఉన్నటువంటి శ్రీ చైతన్య లో ఉమ్మడి జిల్లా ఏజీఎం రమణయ్య ఆధ్వర్యంలో అట్టహాసంగా స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతిని గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది ఆగస్ట్ 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం ఓ ఆనవాయితీగా వస్తుందన్నారు.ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడు బంగారు పతకాలు అందించిన గొప్ప క్రీడాకారుడు అన్నారు. క్రికెట్ కు అంతగా వైభవం లేని రోజుల్లో హాకీ క్రీడ ద్వారా ఇండియా పేరుప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటిచెప్పారన్నారు. మన దేశంలో హాకీ క్రీడకు ఆద్యుడిగా ధ్యాన్‌చంద్ ను అభివర్ణిస్తుంటారు అన్నారు. 1928,1932, 1936 ధ్యాన్ చంద్ సారథ్యంలో ఇండియా హాకీ జట్టు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నదన్నారు.మెరుపు వేగంతో గోల్స్ చేయడం ధ్యాన్‌చంద్ ప్రత్యేకత. తన ఫుట్ వర్క్ తో ఎదుటి ఆటగాళ్లను సులభంగా బోల్తా కొట్టించేవాడు అన్నారు. హాకీ క్రీడతో పాటు ఆర్మీ అధికారిగా అతడు దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించిందన్నారు. అతడి జయంతి రోజును 2012లో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.