మహాప్రసాద భవనాలు ప్రారంభానికి సిద్ధం..
విజయవాడ – ఇంద్రకీలాద్రి : పశ్చిమ ఆగస్టు19:- ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.52.50 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం (లడ్డూ పోటు) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న ఉదయం 11.32 గంటలకు శుభ ముహూర్తంలో రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా భవనాలను ప్రారంభించి భక్తులకు అంకితం చేయనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఈవో శీనా నాయక్ తెలిపారు.
800 మంది భక్తులకు ఒకేసారి భోజనం
రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో సెంట్రల్ స్టోర్ నిత్యాన్నదాన నిల్వ గదులు కిచెన్ ప్రిపరేషన్ ఏరియా క్యూ లైన్లు వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. సరుకుల రవాణాకు మూడు వైపుల నుంచి వాహనాలు రాకపోకలు సాగించేలా మార్గాలను ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తును పూర్తిగా డైనింగ్ హాల్‌గా తీర్చిదిద్దారు. ఇందులో ఒకేసారి 800 మంది భక్తులు కూర్చొని అన్నప్రసాదం స్వీకరించే సదుపాయం కల్పించారు.
మహాప్రసాదాల తయారీకి ప్రత్యేక భవనం
రూ.26.50 కోట్లతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ మొదటి అంతస్తుల్లో ప్రసాద విక్రయ కౌంటర్లు పంపిణీ కేంద్రాలు భక్తుల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రెండో మూడో అంతస్తుల్లో పులిహోర చక్కెరపొంగలి లడ్డూ తదితర మహాప్రసాదాల తయారీ ప్యాకింగ్ నిల్వ నిర్వహణకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
త్వరలో యాంత్రీకృత వంటశాలలు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని త్వరలో అత్యాధునిక యాంత్రీకృత వంటశాలలు (మెకానైజ్డ్ కిచెన్స్) ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వీటి ద్వారా పరిశుభ్రత, ఆహార నాణ్యతలో ఏకరూపతతో పాటు వేగంగా ఆహారం తయారు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఆగస్టు 21న జరగనున్న ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేస్తున్నారని ఈవో శీనా నాయక్ తెలిపారు…


