విశాలాంధ్ర-రాప్తాడు : దుండగుడు హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న గోపికకు, అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మికి ప్రభుత్వం డాక్టర్ల ద్వారా మెరుగైన వైద్యం అందించాలని మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జగ్గుల స్వతంత్ర కుమారి కోరారు. సోమవారం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీని మహిళా నాయకురాలు శాంతకుమారితో కలిసి పరామర్శించారు. స్వతంత్ర కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి పాఠశాలలోనూ కౌన్సిలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సమాజంలో నిత్యం జరుగుతున్న సంఘటనలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని, వారిలో సానుకూల దృక్పథం పెంపొందేలా చైతన్యం తేవాలని కోరారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి బడుల్లో విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


