బ్రాహ్మణ సంకర జయంతి కమిటీ, శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మే 2వ తేదీన జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రామారావు, శివ కుమార్ శర్మ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శంకర చార్యుల జయంతి రోజునే ఉచితంగా సామూహిక ఉపనయములు నిర్వహిస్తామని తెలిపారు. ఈ జయంతి వేడుకలు బ్రాహ్మణ శంకర జయంతి కమిటీ, శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కావున బ్రాహ్మణులు కుటుంబంలో ఎవరైనా ఉపనయనము చేయదలచిన వారు సెల్ నెంబర్ 9603535811 లేదా 944033290కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశంను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మే 2న ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు
మూగజీవాల దాహార్తిని తీర్చేందుకే నీటి తొట్టెల నిర్మాణం..
పీడీ గంగా భవాణి
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : గ్రామాల్లో ఉన్న మూగజీవాల దాహార్తిని తీర్చేందుకే నీటి తోట్టెలు నిర్మాణం చేపట్టినట్లు నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగా భవాణి అన్నారు. గురువారం వలేటివారిపాలెం మండలంలోని పోకూరు, సింగమనేని పల్లి గ్రామాలలో ఉపాధిహామీ నిధులతో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను ఆమె పరిశీలించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూగజీవాలకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి ఈ నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోకూరులో ఏర్పాటు చేసిన నీటి తొట్టెను చూసి ఆనందం వ్యక్తం చేసి పీల్డ్ అసిస్టెంట్ నవులూరి సుబ్బా నాయుడు ని అభినందించారు.పోకూరు నీటి తొట్టెను పీడీ పరిశీలిస్తున్న సమయంలోదారిన వెళుతున్న గొర్రెలు, మేకలు నీటిని చూసి వచ్చి నీటిని తాగడంతో పీడీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మూగ జీవాల యజమానులను ఈ నీటి తొట్టెల వల్ల మీకు ఉపయోగమా కాదా అని అడగగా వేసవి కాలంలో నీటికి చాలా ఇబ్బందులు పడేవారమని ఈ నీటి తొట్టెను నిర్మాణం చేసి మీరు పుణ్యం కట్టుకున్నారని, ఈ నీటి తొట్టెను నిర్మాణం చేసిన పీల్డ్ అసిస్టెంట్ సుబ్బానాయుడు కు , అధికారులకు మూగ జీవాల యజమానులు కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఏపీఢీ బాబూరావు, ఏపీఓ లు దయాసాగర్, ఉమా మహేష్, సమీర్ బాషా,ఈసీ.వంశీ. టిఏ లు మాలకొండయ్య, అశోక్, నాగార్జున, ప్రసాదు, మాలకొండయ్య, పీల్డ్ అసిస్టెంట్ నవులూరి సుబ్బానాయుడు, నాయకులు నలమోతు రవీంద్ర, బొల్లినేని నరసింహం, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, రావి కృష్ణ, తిరుమల రావు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ సేవలు చిరస్మరణీయం…
ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విశాలాంధ్ర -నందిగామ: మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారి కి నందిగామ శాసనసభ్యురాలు,ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రత్యేక అభినందనలు తెలియజేశారు స్థానిక దేవినేని వెంకటరమణ ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు గత నలభై రోజులగా అందిస్తున్న కార్యక్రమంలో గురువారం ఆమె పాల్గొన్నారు ట్రస్ట్ నిర్వాహకులను ఆమె దుశ్యాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దవాళ్లు ఏనాడో చెప్పారని,దైవం మానవ రూపం అంటే ఇదేనేమో అని అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది అని తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇటువంటి మానవతా సేవా కార్యక్రమాలు నందిగామలో ఎన్నో చేపట్టారనీ, గత 40 రోజుల నుంచి నందిగామ గవర్నమెంట్ డివిఆర్ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు మరియు స్థానిక ప్రజానీకానికి అల్పాహార వితరణ చేయటం గర్వించదగ్గ విషయమని అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు వారికి ట్రస్ట్ ద్వారా చేతనైన మేరకు నాణ్యమైన ఉచిత సేవలు అందిస్తూ వస్తున్నారని,వీరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అందరూ ముందుకు వెళితే సామాన్య బడుగు బలహీన వర్గ పేద ప్రజలకు ఆదరణ పెరుగుతుందని తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో మునుముందు రోజులలో తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు,గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది,రోగులు మరియు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అగ్నిమాపక నివారణ పై అవగాహన
విశాలాంధ్ర -అనంతపురం : అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమం లో బాగంగా అనంతపురం నగరంలోని చైతన్య స్కూల్ టవర్ క్లాక్ బ్రాంచ్ నందు గురువారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినప్పుడు నీ విధంగా నివారించాలో విద్యార్థులకు ఏ డి ఎఫ్ ఓ కె పి లింగమయ్య అవగాహన కల్పిస్తూ డెమో ద్వారా వివరంగా తెలియజేయడం జరిగింది. ఇందులో బాగంగా మొదటిగ అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే పొగ గదుల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించవలెను అక్కడ చిక్కుకున్న వ్యక్తులను రెస్క్యూ మెథడ్స్ ద్వారా పైనంతస్తుల నుండి వారిని రక్షించి సహాయ చర్యలను అందించే విధానాన్ని తెలియజేశారు.విద్యార్థులు, విద్యార్థినిలు స్కూల్ బోదన సిబ్బందికి ప్యానిక్ కాకుండా మనసులో అలజడి చెలరేగకుండా ఏ విధంగా పై అంతస్తుల నుండి కిందికి ఎరాక్యులేషన్ ద్వారా తొక్కిసలాటలేకుండా ప్రజలు అప్రమత్తంగా వచ్చే విధంగా ఉండే రెస్యూ మెథడ్స్ ని చేసి చూపించడం జరిగింది. అలాగే పై అంతస్తు నుండి చైర్ నాట్ సహాయంతో పై అంతస్థులలో ప్రమాదాలలో చిక్కుకొని సృహ కోల్పోయిన వ్యక్తులను ఎలా కిందికి దింపవచ్చును అనునది డెమో ద్వారా చేసి నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించదమైనది మరియు కరపత్రములు పంచడమైనది. ప్రజలు మరియు విద్యార్థులు స్టయిర్కేసు ద్వారా ఎవకుయేషన్ డ్రిల్ చేసి వారికి ఎటువంటి ప్రమాదము కలిగిన ఎలా పై అంతస్తు నుండి కిందికి రావడం మరియు పై అంతస్తులలో చిక్కుకున్న ప్రజలను గాని సిబ్బందిని గాని ఏ విధంగా కాపాడగలము అని రెస్క్యూ మెథడ్స్ ద్వారా తెలపడం జరిగినది. గ్యాస్ ఫైర్ జరిగిన యడల సి ఓ 2 ద్వారా ఏవిధంగా వాటిని నివారించవచ్చు, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా కాపాడవచ్చును అనునటువంటి అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినది. అక్కడి ప్రజలు మరియు సెక్యూరిటీ సిబ్బందికి ఇలాంటి ఎన్నో రకాల అగ్నిమాపక నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రాణ మరియు ఆస్తి నష్టాలను కాపాడుకోవచ్చునని తెలియజేశారు. స్కూల్ నందు ఎటువంటి అగ్ని నివారణ పరికరములు ఉంచుకోవలెను ఎటువంటి జాగ్రత్తలు తెసుకోవలెను అనేవిషయాలను విద్యార్థులు, విద్యార్థినిలు, స్కూల్ బోదన సిబ్బందికి ప్రిన్సిపల్ మరియు మేనేజర్ గోపాల్ కి జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి కె. పి లింగమయ్య తెలియజేసినరు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ నందు అవగాహన కొరకై వాల్ పేపర్స్ అతికించడమైనది.
అవగాహన కార్యక్రమంలో ఎల్ ఎఫ్ లు జి. గోవింద రాజులు , ఎస్. రమేష్ కుమార్ రెడ్డి , ఈ.ఈరేష్ గౌడ్ డి ఓ పి,ఎఫ్ ఎం లు సి. మధుసూదన, వై. ఓబీ రెడ్డి, జి. శ్రావణ కుమార్ , జి. తిప్పే స్వామి, కే.జయరాముడు , కే. అనిల్ కుమార్ , బి. సుధాకర్ , ఏం.రమేష్ , తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సెవెన్ హిల్స్ పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం
విశాలాంధ్ర-విజయవాడ : ప్జానిక సీతారాంపురంలోని శ్రీ సెవెన్ హిల్స్ పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం వినూత్న రీతిలో జరిగింది. చిన్నారులకు వివేకానందుని వేషధారణతో కూడిన వస్త్రధారణను విద్యార్థులు ధరించి తమ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేకానందుని వేషధారణను ఎన్నుకోవడంలో ముఖ్య ఉద్దేశము వివేకానందుని జీవితము ఎంతో మందికి ఆదర్శము. యువతకు స్ఫూర్తిదాయకము అని పాఠశాల కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ రాజు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు అందజేయటమే మా పాఠశాల ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ప్రేక్షకులను ఆద్యంతము ఆకర్షింపజేసే విధంగా కార్యక్రమాలు జరిగాయి. తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఇటువంటి పాఠశాలలో తమ పిల్లలను చదివించటం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. చదువుతోపాటుగా నైతిక విలువలను చిన్న వయస్సు నుండి విద్యార్థులలో పెంపొందించుకోవాలని చల్లా లక్ష్మీ నారాయణ అన్నారు. వివేకానందుని వేషధారణలతో పాఠశాల ప్రాంగణం అంతా కళకళలాడిరది. చిన్నారులతో స్వామి వివేకానందుడు ఉన్నట్టుగా వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు రామకృష్ణ, జె.వి.షణత్ కృష్ణ, రాఘవరాజు. దుర్గాప్రసాద్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ డి. సునీత కార్యక్రమం పర్యవేక్షించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంతో ఉత్పాహంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.



ట్రంప్ టారిఫ్‌లపై కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం: కోర్టులో దావాకు సిద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను (టారిఫ్‌లు) సవాలు చేస్తూ కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో దావా వేయనుంది. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, వాటిని విధించే అధికారం అధ్యక్షుడికి లేదని ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా, ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ టారిఫ్‌ల వల్ల కాలిఫోర్నియాలోని కుటుంబాలు, వ్యాపారాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయని గవర్నర్ న్యూసమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ధరలు పెరిగిపోతున్నాయని, ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ కుటుంబాల ప్రయోజనాల కోసం మేము నిలబడుతున్నాం. ఈ గందరగోళం కొనసాగడానికి వీల్లేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ విధ్వంసకర, గందరగోళ టారిఫ్‌లను విధించే అధికారం డొనాల్డ్ ట్రంప్‌కు లేదని, దీనివల్ల అమెరికా చాలా నష్టపోతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. అందుకే తాము ఆయనను కోర్టుకు లాగుతున్నామని స్పష్టం చేశారు.
అధ్యక్షుడు ట్రంప్అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ఈ టారిఫ్‌లను విధించారు. అయితే, ఏకపక్షంగా ఇలాంటి సుంకాలను విధించే అధికారాన్ని ఆ చట్టం అధ్యక్షుడికి ఇవ్వలేదని కాలిఫోర్నియా అధికారులు తమ దావాలో వాదించనున్నారు. ఈ మేరకు ఉత్తర కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో త్వరలో దావా దాఖలు చేయనున్నట్లు సమాచారం.
దేశంలోకి వచ్చే సరుకు రవాణాలో 40 శాతం కాలిఫోర్నియాలోని రెండు ప్రధాన ఓడరేవుల ద్వారానే జరుగుతుందని, ఇందులో చైనా నుంచే దాదాపు 50 శాతం ఉంటుందని గవర్నర్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఈ టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. 675 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంతో, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలకు కాలిఫోర్నియా కేంద్రంగా ఉంది.
ట్రంప్ విధానాలపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాల (టారిఫ్‌లు) ప్రభావం అగ్రరాజ్య కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై స్వదేశంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై న్యాయపోరాటానికి సిద్ధం కాగా, తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జోరోమ్ పావెల్ దీనిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.ట్రంప్ టారిఫ్ విధానాలతో అమెరికాలో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన మండిపడ్డారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వు సిస్టమ్ (అమెరికా కేంద్ర బ్యాంకు)ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.
చార్జీలు పెంచే యోచనలో మెట్రో..
నగరంలో ట్రాఫిక్ చిక్కులు, అనారోగ్యానికి కారణమయ్యే కాలుష్య బెడదను తప్పించుకోవడానికి సిటీవాసులకు ఉన్న ఏకైక సాధనం మెట్రో.. సిటీలో తక్కువ ఖర్చుతో సుఖంగా ప్రయాణం చేయడం మెట్రోతోనే సాధ్యం. ముఖ్యంగా ఈ వేసవిలో ఏసీ వాహనంలో ప్రయాణించాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. అందుకే జంట నగరాల పరిధిలో నిత్యం లక్షలాదిమంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, ఇకపై మెట్రో ప్రయాణం కూడా భారం కానుందని సమచారం. కరోనా కాలం నుంచి కొనసాగుతున్న నష్టాలను భర్తీ చేసుకోవడానికి హైదరాబాద్ మెట్రో అధికారులు ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.6,500 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ఇటీవల ప్రకటించింది. ఛార్జీల పెంపునకు 2022లో అప్పటి బీఆర్ఎస్ సర్కారుకు విజ్ఞప్తి చేయగా.. సానుకూలంగా స్పందించిన సర్కారు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ యాక్ట్-2002 కింద ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎల్ అండ్ టీ ప్రతిపాదనలు, ప్రయాణికుల అభ్యంతరాలు పరిశీలించాక ఛార్జీల పెంపునకు కమిటీ ఓకే చెప్పింది. అయితే, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఛార్జీల పెంపునకు నాటి బీఆర్ఎస్ సర్కారు అంగీకరించలేదు. దీంతో ఛార్జీల పెంపు ప్రతిపాదన పక్కన పడింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాజాగా ఈ ప్రతిపాదనను మెట్రో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. భారీ నష్టాలను చవిచూస్తున్నామని, ఛార్జీల పెంపునకు ఆమోదం తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఛార్జీల పెంపు తప్పేలా లేదని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇటీవలే బెంగళూరు మెట్రో కూడా ఛార్జీలు పెంచిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు. బెంగళూరు మెట్రో ఏకంగా ఛార్జీలను 44 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఏమేరకు పెంచాలని కోరుతుందనే వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం మెట్రో ఛార్జీలు కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.60 లుగా ఉన్నాయి.
మార్పు గుజరాత్ నుంచే ప్రారంభం : రాహుల్ గాంధీ
గుజరాత్ తో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు
బీజేపీ, ఆరెస్సెస్ ను ఓడించే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్న రాహుల్
గుజరాత్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో… ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో సత్తా చాటి పునర్వైభవాన్ని సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం గురించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ… బీజేపీ, ఆరెస్సెస్ ను కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని చెప్పారు. గుజరాత్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు గుజరాత్ నుంచే ప్రారంభమవుతుందని రాహుల్ అన్నారు. పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు నూతన నాయకత్వాన్ని తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయపరమైనదే కాదని, సిద్ధాంతపరమైనది కూడా అని తెలిపారు. బీజేపీ, ఆరెస్సెస్ లకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓడిస్తుందనే విషయం ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని దెబ్బతీస్తోందని రాహుల్ అన్నారు. తమ వద్ద రెండు రకాల గుర్రాలు ఉన్నాయని… వీటిలో ఒక రకం రేసు గుర్రాలని, రెండో రకం పెళ్లిళ్లకు తీసుకెళ్లే గుర్రాలని తెలిపారు. పెళ్లిళ్లకు వెళ్లాల్సిన గుర్రాలను కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు రేసులకు పంపుతోందని… రేసు గుర్రాలను కొన్నిసార్లు పెళ్లళ్లకు పంపుతోందని చెప్పారు. ఈ గుర్రాలను విభజించాల్సిన అవసరం ఉందని… పరిస్థితిని మారుస్తామని తెలిపారు. సరైన నేతలకు సరైన బాధ్యతలను అప్పగిస్తామని అన్నారు. కొందరు నేతలు బీజేపీకి దగ్గరగా ఉంటున్నారని… అలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మూగ, చెవిటి బాలికపై అఘాయిత్యం.. యూపీలో దారుణం
మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి బాలిక (11) దారుణ అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన గ్రామస్థులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి నిందితుడు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత చిన్నారి మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా.. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో నగ్నంగా, అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు మీరట్‌కు రెఫర్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ (24) అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు డాన్ సింగ్ కాలికి బుల్లెట్ గాయమైందని రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. నిందితుడు బాలికతో ఆమె ఇంటి వద్ద మాట్లాడి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.