Saturday, January 25, 2025
Home Blog Page 2

వేరుశనగ పంట లో మచ్చ తెగులు ఎక్కువ ఆశించినట్లు గుర్తించడం జరిగింది

పంట పొలాలను పరిశీలించిన అగ్రికల్చర్ ఆఫీసర్ ముస్తఫా
విశాలాంధ్ర ధర్మవరం ; మండల వ్యవసాయ అధికారి ముస్తఫా నాగలూరు గ్రామంలో వేరుశనగ పంట పొలాలను పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగ పంట లో మచ్చ తెగులు ఎక్కువ ఆశించినట్లు గుర్తించడం జరిగింది అని, లేత దశలో ఆకుమచ్చ ఆశించిన పైరుకు సాఫ్(కార్బండజిమ్ 12 శాతము +మ్యాంకొజెబ్63 శాతము) రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి వేపిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు.అలాగే ముదురుదశలో ఉన్న వేరుశనగ పైరులో మచ్చ తెగులు నివారణ కోసం అజాక్సి స్ట్రోబిన్ 11 శాతం+టుబుకొనజోల్ 18.3 శాతము రెండు యం. యల్. లీటరు నీటికి కలుపుకుని పిచికారి చేసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేశారు. అలాగే పూత దశలో ఉన్న వేరుశనగ పంటకు 200 కేజీలు జిప్సం వేసుకోవాల్సిందిగా తెలియజేశారు. దీనివలన కాయ నాణ్యత పెరిగి నూనె శాతం వృద్ధి చెందుతుంది అని తెలిపారు.
మద్దతు ధర రూ 7550/- లేదా మార్కెట్ ధరతో ప్రభుత్వం కందులు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది అని తెలిపారు. కావున కంది సాగు చేసిన రైతులందరూ రైతు సేవ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో రైతులు , గ్రామ ఉద్యాన సహాయకుడు సాయి చరిత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించండి

హెల్మెట్, సీటు బెల్టుతోనే వాహనాలను నడపాలి

విశాలాంధ్ర, కదిరి; (శ్రీ సత్య సాయి జిల్లా)ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా
రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రయాణం సాగించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వర ప్రసాద్ తెలిపారు.
రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా శుక్రవారం పట్టణంలో వాహనాల యజమానులు డ్రైవర్లు, ప్రజలతో కలిసి వాక తాన్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు గులాబీ పువ్వులు, కర పత్రాలు అందిస్తూ ర్యాలీ నిర్వహించారు.వాహనదారులు హెల్మెట్ లేదా సీటు బెల్టుతో వాహనాలను నడపాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు.డ్రైవింగ్ పై డ్రైవర్ల అజాగ్రత్త వలన దేశంలో 87శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సర్వేలు తెలుపుతున్నాయని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించి నడపరాదని, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు.అలా చేసినచో ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను (మైనారిటీ) కు ద్విచక్ర వాహనాలు ఇచ్చి వాహనాలు నడిపించినచో వారితో పాటు తల్లిదండ్రులకు జరిమానా విధించడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కావున ప్రతి వాహనదారుడు నియమ నిబంధనలు పాటించి ప్రమాద రహిత ప్రయాణం చేయాలని వారు తెలిపారు. ఈ
కార్యక్రమంలో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేష్, పట్టణ సీఐ నారాయణ రెడ్డి, రూరల్ అప్ గ్రేడ్ సీఐ నిరంజన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

సినీ పరిశ్రమకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అతి పెద్ద చర్చ ఏమిటంటే… ఫేక్ కలెక్షన్స్! మా సినిమాకు వందల కోట్లు వచ్చాయంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. ఈ కలెక్షన్స్ నిజమేనా అనేదానిపై స్పష్టత ఉండడంలేదు. ఈ క్రమంలో ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై పడ్డారు. కలెక్షన్లు ఎంత వచ్చాయి? దానికి తగ్గట్టుగా లెక్కలు చూపించారా? అనే కోణంలో రెయిడ్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయంలో వారు సోదాలు జరిపారు. నాలుగు రోజుల ఐటీ సోదాల్లో దిల్ రాజుకు సంబంధించిన పలు కీలక అంశాలను ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆయన ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ టీమ్ ప్రస్తుతం లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డి ఇంట్లో కూడా డాక్యుమెంట్లను అధికారులు వెరిఫై చేస్తున్నారు. అటు, పుష్ప-2 సినిమాకు సంబంధించి రూ. 1,800 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ దానికి తగినట్టుగా పన్నుల చెల్లింపులు జరిగనట్టు ఐటీ అధికారులు గుర్తించారు. నాలుగు రోజులుగా 18 ప్రదేశాల్లో ఐటీ అధికారులు 55 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు.

లింగ అసమానతలను రూపుమాపాలి

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా ): సమాజంలో ప్రతి ఒక్క బాలుడు బాలికలపై లింగ అసమానతలను రూపుమాపాలని ఐసిడిఎస్ అధికారి ఎస్. షాజీదా బేగం, చుక్కలూరు ప్రాథమిక వైద్యాధికారిని డాక్టర్. లావణ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చుక్కలూరు హై స్కూల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ బి. విజయకుమారి అధ్యక్షతన జాతీయ బాలిక దినోత్సవం, విద్యార్థులకు లింగవక్షత పై వ్యాసరచన పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఐసిడిఎస్ అధికారి ఎస్. షాజీదా బేగం, చుక్కలూరు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్. లావణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో బాలికలపై లింగ వివక్షత చూపడం మానుకోవాలన్నారు. ప్రతి ఒక్క బాలుడు బాలికలను గౌరవించి, వారికి రక్షణగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బాలురకు సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల చేత బాలికలకు సమానావకాశాలు కల్పిస్తూ, లింగ అసమానతలను రూపుమాపి వారికి ప్రోత్సాహం కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దస్తగీరమ్మ, పల్లవి అంగన్వాడీ టీచర్లు ప్రమీల, పెద్దక్క, వాణి స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ఉత్త‌మ నియోజవర్గ సహాయ ఎన్నిక‌ల అధికారిగా కృష్ణంరాజు ఎంపిక

నేడు అమ‌రావ‌తిలో పుర‌స్కార ప్ర‌దానం

విశాలాంధ్ర-(విజయనగరం జిల్లా.రాజాం) : రాజాం నియోజకవర్గ ఉత్త‌మ ఎన్నిక‌ల సహాయ అధికారిగా రాజాం తాసిల్దార్ ఎస్.కృష్ణంరాజు ఎంపిక‌య్యారు. బెస్ట్ ఎల‌క్ట్రోర‌ల్ ప్రాక్టీసెస్ క్రింద ఈ పుర‌స్కారం వ‌రించింది. ఉత్త‌మ ఏఆర్ఓగా రాజాం తాహ‌సీల్దార్ ఎస్‌.కృష్ణంరాజు, ఈ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. ఆయన ను శ‌నివారం విజ‌య‌వాడ తుమ్మ‌ల‌పల్లి క‌ళాక్షేత్రంలో జ‌రిగే జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో పుర‌స్కారాల ప్ర‌దానం జ‌రుగుతుంది.ఎంపిక పట్ల స్థానిక తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయనను ప్రత్యేకించి అభినందించారు.

ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతరాత్రి దావోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లను కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు స్పెషల్ ప్యాకేజి ప్రకటించడం పట్ల నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. కాగా, దావోస్ లో సీఎం చంద్రబాబు పర్యటన నాలుగు రోజుల పాటు సాగింది. దిగ్గజ సంస్థల సీఈవోలు, చైర్మన్లతో భేటీ అయిన చంద్రబాబు… ఏపీకి భారీ పెట్టుబడులు రాబట్టడంలో సఫలమయ్యారని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పొగమంచు .. విమానాల రాకపోకలకు అంతరాయం

గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రికి మళ్లింపు
విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఫ్లడ్ లైట్ ల వెలుగులతో నెమ్మదిగా ముందుకు వెళుతున్న వాహనాలు

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసింది. పొగమంచు కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ ఉ విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో హైవేపై హెడ్ లైట్ల వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మహారాష్ట్ర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..

మహారాష్ట్రలో భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వర్కర్లు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ప్లాంట్ పైకప్పు కూలిపోయిందని, పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని చెప్పారు. భారీగా పొగ, మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 12 మంది వర్కర్లు విధుల్లో ఉన్నారని, అందులో ఇద్దరిని రక్షించామని అధికారులు చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు భేటీ

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల‌పై చ‌ర్చించారు. ఆర్థిక‌సాయం అందించాల‌ని ఆమెకు విజ్ఞ‌ప్తి చేశారు. అమ‌రావ‌తికి హ‌డ్కో రుణం, వ‌ర‌ల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాల‌నూ కేంద్ర‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంత‌రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ స‌మావేశం కానున్నారు. ఆ త‌ర్వాత‌ కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సమావేశం అవుతారు. అనంతరం ఈరోజు సాయంత్రం చంద్రబాబు విజయవాడ బయల్దేరి రానున్నారు. కాగా, నాలుగు రోజుల పాటు వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సు కోసం దావోస్ ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న విష‌యం తెలిసిందే.

ట్రంప్ రాక‌తో విద్యార్థుల్లో భ‌యం భ‌యం.. పార్ట్ టైమ్ ఉద్యోగాల‌కు బై బై…

ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావొద్దనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేస్తున్నామని అగ్రరాజ్యంలోని మన విద్యార్థులు చెబుతున్నారు. నెలవారీగా అయ్యే ఖర్చుల కోసం పార్ట్ టైమ్ పై ఆధారపడతామని తెలిపారు.క్లాసులు అయిపోయాక ఎక్కడో ఓ చోట పనిచేయకుంటే ఇక్కడ బతకలేమని వివరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన స్టూడెంట్లలో చాలామంది పార్ట్ టైమ్ చేస్తున్నారని సమాచారం. అయితే, ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం.. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో (ఆన్ క్యాంపస్) వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది.అయితే, వర్సిటీలో వందలాదిగా ఉండే విద్యార్థులు అందరికీ పని దొరకదు. దీంతో చాలామంది అనధికారికంగా బయట హోటళ్లు, పెట్రోల్ బంక్ లు తదితర వాటిలో పార్ట్ టైమ్ చేస్తుంటారు. విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా ఉండదు.

ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది. దీంతో చాలామంది తమ పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలలో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దవుతుందనే ఆందోళనతో ముందుజాగ్రత్త పడుతున్నారు. అమెరికాలో ఉన్నతవిద్య కోసం దాదాపు 50 వేల డాలర్లు (రూ.42 లక్షలకు పైగా) ఖర్చయిందని, ఇప్పుడు వీసా రద్దయి ఇండియాకు వెళ్లాల్సివస్తే ఆ అప్పు తీర్చే మార్గమే ఉండదని ఓ విద్యార్థి వాపోయాడు. ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేశాక వలస విధానంలో మార్పులు, అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు కఠిన చర్యలు చేపట్టాడని వివరించారు.