Wednesday, November 12, 2025
Home Blog Page 64

అబద్ధపు హామీలతో ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వం

— వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు.

విశాలాంధ్ర – కడియం : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారం చేపట్టిన తర్వాత కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివలన అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో మంగళవారం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి ఆధ్వర్యంలో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో రోడ్ల దుస్థితి చాలా దారుణంగా ఉందని విమర్శించారు. ప్రచారంలో ముందున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉందన్నారు. మెడికల్ కాలేజీల పిపిపి విదానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల స్వామి నాయుడు, మండల అధ్యక్షులు యాదల సతిష్ చంద్ర స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాలబాబు, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, ఊటుకూరి శైలజ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలసిన ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ లు మంగళవారం ఉదయం ఆమె చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకుని, పూల మొక్కతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు  నర్సరీ రంగంలోని పలు సమస్యలపై చర్చించినట్లు మార్గాని తెలిపారు. ఏకో టూరిజంకు సంబంధించి, ధవలేశ్వరం నుండి పొట్టిలంక వరకు బోట్ షికార్ కు సంబంధించిన విషయాలను చర్చించినట్లు చెప్పారు

మేడా ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 

స్వాతంత్ర్య దినోత్సవం వేడుక డే లో మార్పు తధ్యమా ? 

మేధావులకు మేడా మాటలు ఆలోచింప చేస్తాయా ?  లేదా భవిష్యత్ తరాలకు ప్రశ్నలు గా మిగిలిపోతాయా ? 

విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : ఇప్పుడు  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏమిటి ?  ఈ జెండా ఆవిష్కరణ ఏమిటి ? ఆవిష్కరించిన ఈ మేడా ఎవరు ? అని ఆశ్చర్యం కలుగుతుంది కదూ ! నిజంగా ఆశ్చర్యమే అయినా   తీరా చూసేసరికి అవునా ! నిజమా ! ఇంతకాలం మనకు ఈ విషయం తెలియనే లేదా అంటూ ముక్కున  వేలేసుకుంటాం.  వివరాల్లోకి వెళ్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత పోరాటంతో 1943 అక్టోబర్ 21 న అధికారికంగా ప్రకటించుకున్న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయం వద్ద అర్పిసి అధినేత మేడా శ్రీనివాస్ సారథ్యంలో అత్యంత ఘనంగా నేతాజీ సాధించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను జరుపుకున్నారు . ముందుగా జాతీయ జండాను మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు . అనంతరం భారతదేశం కోసం నేతాజీకి వెన్ను దన్నుగా నిలిచి ఆత్మ బలిదానానికి సిద్దపడిన యోధురాలు  ” నీరా ఆర్యా ”  ను , స్వాతంత్య్రం అనంతరం భారతదేశం కోసం పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం ప్రాణాలు విడిచిన రవీంద్ర కౌశిక్ లను స్మరించుకున్నారు . నేతాజీ ని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రం దినం 1943 అక్టోబర్ 21 తేది అని , ఈ రోజునే నేతాజీ సారథ్యంలో అధికారికంగా భారతీయ పాలన అధికారం లోకి వచ్చినది . ఈ రోజు భారతీయుల వీరోచిత పోరాటాలకు , నేతాజీ గుండె ధైర్యానికి బ్రిటిష్ పాలకులు భయపడి పారిపోయిన గొప్ప రోజు నేటి రోజు . అప్పటి కొంతమంది భారతీయ బ్రిటిష్ వారి మోచేతుల నీళ్లు త్రాగిన ఆ నాటి కాంగ్రెస్ అధినేతలు భారతీయుల ప్రాణ త్యాగాలతో నేతాజీ ప్రకంపనలతో సాధించిన స్వాతంత్రియాన్ని ఎలాగైనా మరుగున పెట్టాలి అని బ్రిటిష్ వారితో కుట్రలు సాగించి ఈ వీరోచిత దినం ను చరిత్ర పుటల్లో కనుమరుగయ్యే విధంగా కుట్రలు చేసారు . నేతాజీ పేరు బ్రిటిష్ వెన్నులో వణుకు పుట్టించిన కారణంగా ఆ నాటి కాంగ్రెస్ నేతలుగా వున్న గాంధీ – నెహ్రూ లే స్వాతంత్య్రం భారతీయులకు రావటానికి కారణం అని బ్రిటిష్ వారి రికార్డులలో తప్పును ఒప్పుగా నమోదు చేయించారు . నేటికి సాధించు కున్నటువంటి స్వాతంత్య్రం ను విస్మరిస్తు గాంధీ – నెహ్రూ లు ప్రకటించిన స్వాతంత్ర్య దినం ను వేడుకగా జరుపుకుంటున్నాము . సాధించుకున్నటువంటి స్వాతంత్య్రం ను మరిచిపోతున్నాము. ఇక నుండి ప్రతి భారతీయుడు నేతాజీ సారథ్యంలో పూర్తి స్వేచ్ఛను సాధించుకున్న రోజు అక్టోబర్ 21 న స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవాలని , ప్రభుత్వం కూడా ఈ వాస్తవ వీరోచిత చరిత్రను గుర్తించి స్వాతంత్ర్య వేడుక దినంగా ప్రకటించాలి . ఈ రోజునే సెలవు దినంగా ప్రకటించాలని , నేతాజీ స్ఫూర్తితో భారతీయులు అందరు దేశం కోసంమే బ్రతకాలి , దేశం కోసమే మరణించాలి అనే ఉగ్గు పాలను జన్మతః బిడ్డలకు తల్లిదండ్రులు ఊపిరిగా నింపాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు . యావత్ అఖండ భారతదేశంలోనే తొలి సారిగా నేతాజీ సారథ్యంలో సాధించుకున్న వాస్తవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజమండ్రి లో జరుపుకుంటున్నందుకు మిక్కిలి సంతోషంగా వుందని , ఈ ఘటన రాబోవు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని , ఈ వీరోచిత స్వాతంత్ర్య దినం 82 ఏళ్ల అననంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో జరుపుకుంటున్న ఈ చారిత్రిక అంశం ప్రపంచ చరిత్రలో లిఖించ బడుతుందనటంలో ఏ మాత్రం సందేహమే లేదు . రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఈ గొప్ప దినం ను స్వాతంత్ర్య దినంగా ఆచరించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మన భారత పౌరులను కోరారు ..అనంతరం బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన భారతీయ యోధుడు శ్రీ శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటం వద్ద గౌరవ అంజలి ఘటించి పౌర వందనాలు సమర్పించారు . వందేమాతర గీతాలాపనతో దేశ భక్తిని చాటుకున్నారు . దేశం కోసం బ్రిటిష్ వారితో అంతిమ పోరాటం సాగించి స్వేచ్చను ప్రసాదించిన ఆ మహా యోధుడు మరణం ఒక మిస్టరి. ప్రజల హృదయాల్లో నేటికి జీవించి ఉన్నటువంటి ఒక మహా నేత సుభాష్ చంద్ర బోస్ . యావత్ ప్రపంచంలోనే వుండరు . నేతాజీ వంటి మరో పోరాట యోధుడు నేటికి లేరని , నేతాజీ భారతీయుల ప్రతిష్టకు  ఐ కాన్ కు మించిన ఐ కాన్ వంటివారు . భారతదేశ చరిత్రలో నేతాజీ తో పాటుగా ఎందరో దేశం కోసం ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళను ప్రాణ భయంతో పారిపోయేలా చేసారని, ఆ నాటి కాంగ్రెస్ వాళ్ళ కుట్రలతో ఆ పోరాట యోధుల చరిత్రను , వారి పేర్లను చరిత్ర పుటల్లో లేకుండా చేసారు . ఆ నాడు బ్రిటిష్ వారు మన పౌరులపై ఆధిపత్యం చెలాయిస్తే , గాంధీ , నెహ్రులు మతోన్మాద చర్యలకు అగ్గి రాజేసి బ్రిటిష్ వారి కుట్రలకు పరోక్షంగా సహకరించరనే ఆరోపణలు బలంగా ఉండేవి . నేతాజీ మరణం సహజం కాదనేది యదార్థం అని మెజార్టీ భారతీయుల విశ్వాసం అని ఆయన కన్నీటి పర్యాంతం అయ్యారు .అనంతరం పార్టి సెక్యులర్స్ , శ్రేణులు సాధించుకున్న స్వాతంత్ర్య దినోత్సవ దినం గొప్పతనంను స్మరించుకుని స్వీట్లు పంచుకున్నారు . భారతీయుల త్యాగాలను చర్చించుకున్నారు ..    అయితే మరి ఏది నిజం ? మేడా చెప్పిన 82 సంవత్సరాల నేతాజీ స్వాతంత్రం స్వాతంత్ర దినోత్సవం గా భావిద్దామా ? లేదా 78 సంవత్సరాల గాంధీ నెహ్రూల స్వాతంత్రమును స్వాతంత్ర దినోత్సవం గా భావించాలా ? అన్నది  కొత్తగా ఏర్పడిన చిక్కుముడిగా  మారనుందా? మేడ మాటలు  మేధావులను ఆలోచనలోకి తీసుకువెళ్లి దేశవ్యాప్త చర్చకు దారితీస్తాయా లేదా భవిష్యత్ తరాలు కూడా ప్రశ్నలుగా మిగిలిపోతాయా వేచి చూడాల్సిందే ఈ చారత్రిక భారత స్వాతంత్ర్య వేడుకలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ పెండ్యాల కామరాజు , కాసా రాజు , డి వి రమణమూర్తి , లంక దుర్గా ప్రసాద్ , బర్ల ప్రసాద్, ఎమ్ డి హుస్సేన్ , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ ,  వాడపల్లి జ్యోతిష్, కారుమూరి యుగంధర్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , కొల్లి సత్యనారాయణ , ద్వాదశి శ్రీనివాసరావు, కాకర ప్రసాద్ , దోషి నిషాంత్ , వల్లి శ్రీనివాసరావు, యర్రా బాల మురళి కృష్ణ , చల్లా సాంబశివరావు , ఖండవల్లి శ్రీనివాసరావు , కూరాకుల నాగమణి , మీసాల హైమావతి , మాసా అప్పాయమ్మ, నాగూరు దుర్గ , వాసంశెట్టి శిరీషా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనియున్నారు ..

ఈశ్వరయ్య ఎన్నిక పట్ల హర్షం..

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గా గుజ్జల ఈశ్వరయ్య ఎన్నిక పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ లో ఈశ్వరయ్య ఎన్నిక ను జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. యువకుడు, విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన ఈశ్వరయ్య ఎన్నిక పట్ల సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి సంజీవప్ప, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శి నరసింహులు, మండల కార్యదర్శిలు ఆంజనేయులు , తిమ్మరాయుడు, తిరుపాల్ ,నాగరాజు నాయక్ , మహదేవప్ప, మహాదేవ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

నేత్రదానం చేసిన సురుపు వరలక్ష్మీ సరోజమ్మ

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని శారదా నగర్కు చెందిన కీర్తిశేషులు సురువు నాగరాజు మరణించి నేటికి 13 రోజులు జరగకుండానే భార్య కీర్తిశేషులు సురువు వరలక్ష్మి సరోజమ్మ (50) ఆదివారం మృతి చెందింది. ఇటువంటి సమయంలో విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానంపై అంగీకారం తెలపడంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుళ్ళాయప్ప, కంటి రిటైవల్ సెంటర్ సహకారంతో టెక్నీషియన్ రాఘవేంద్ర విశ్రాంత కంటి వైద్య నిపుణులు సంకారపు నరసింహులు, కంటి కార్నియా సేకరించారు. నేత్రదానానికి సహకరించిన కుమారుడు అశ్వత్ నారాయణ, సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరి, బావ సత్యనారాయణ, తమ్ముళ్లు పార్థసారథి జై చంద్ర తిమ్మరాజు లకు విశ్వవిభ సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు గాజుల సురేష్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ,జూజారు రఘు ,టీచర్ లక్ష్మీనారాయణ, ఆది, కేశవరెడ్డి, ఆదినారాయణ, వెంకటరమణ బాబు తదితరులు పాల్గొన్నారు.

రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర తిరగ రాస్తా..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : రాబోయే కాలంలో ధర్మవరం చరిత్రను తిరగ రాస్తాను అని, విమర్శలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేస్తున్న వారికి తగిన బుద్ధి ప్రజలే చెబుతారు అని వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కుళ్లాయప్ప, అగిలే శంకర్ రెడ్డి పెద్దిరెడ్డి శ్రీనివాసులు కేతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటే కబ్జాలు చేస్తున్నారంటూ ప్రచారం చేయడం తగదన్నారు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి దరఖాస్తులు ఇస్తున్నారని మరి ఒకటైన మీరు పరిష్కారం చూపించారా అని వారు ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తాను ఉన్నప్పుడు నడుపుతూ భద్రత కూడా కల్పించడం జరిగిందన్నారు. నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేక పోయిందని వారు ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, అమలు చేసిన వాటికి ఏమాత్రం పొంతన లేదని తెలిపారు. మెనీ పోస్ట్ లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీని అని వారు స్పష్టం చేశారు. కూటమి పాలనలో ఎవరెవరు ఏమి మాట్లాడారో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అన్ని డిజిటల్ బుక్ లో నమోదు కావడం జరిగింది అన్నారు. అన్నిటికీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి 2.0 లో సమాధానం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తాము గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలు వేస్తున్నామని. రాబోయే మూడేళ్లలో ధర్మవరం చరిత్రను తిరగరాస్తానని కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యేలు అంటే ప్రజా సేవకులే…

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : ఎమ్మెల్యేలు అంటే ప్రజాసేవకులే కానీ ప్రజలను ఇంటి చుట్టూ తిప్పుకోవడం కాదని తాడిపత్రి వైసిపి మాజీ సమన్వయ కర్త విఆర్. రామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక విఆర్ నివాసం వద్ద వైసిపి మాజీ సమన్వయ కర్త విఆర్. రామిరెడ్డి ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా దాదాపు 250 మంది ఆటో డ్రైవర్లకు దుస్తులు పంపిణీ, డ్రైవర్లకు ఉచితంగా లైసెన్సులు కూడా ఇప్పిస్తానని విఆర్. రామిరెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే గతంలో తాడిపత్రి, గుంతకల్, నియోజక వర్గాలలో డౌన్ పేమెంట్ కట్టి 450 ఆటోలకు పైగా డ్రైవర్లకు ఆటోలను పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా విఆర్. రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను తీర్చలేని ఎమ్మెల్యేలను ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీయాలని అన్నారు. ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ప్రజలను తిప్పుకునే ఎమ్మెల్యేలు ప్రజలకు అవసరం లేదని, ప్రజల చుట్టూ తిరిగే ఎమ్మెల్యేలు ప్రజలకు అవసరమన్నారు. ఎమ్మెల్యేలు ప్రజా సేవకులు కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు ప్రతినెల దాదాపు 3 లక్షల రూపాయల జీతం వారికి మన రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా పింఛన్ రూపంలో ప్రతినెల వారికి డబ్బు వచ్చినట్టు మన ప్రభుత్వాలు ప్రజాధనంతో ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పలు నగరాలలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే ఎమ్మెల్యేలు లేరని విమర్శించారు.

నల్లుల బెడదతో గూగుల్ ఆఫీస్ క్లోజ్..

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలంటూ ఉద్యోగులకు కంపెనీ సూచన
అమెరికాలోని మన్ హట్టన్ గూగుల్ క్యాంపస్ లో నల్లులు

ఆఫీసులో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని వెల్లడి
న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ తాత్కాలికంగా మూతపడింది. ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని మెయిల్ పెట్టింది. దీనికి కారణం నల్లుల బెడదని కంపెనీ పేర్కొంది. ఆఫీసులో నల్లుల బెడదను పరిష్కించే వరకు ఆఫీసుకు రావద్దని సూచించింది. మన్ హట్టన్ చెల్సియా క్యాంపస్ లోని ఆఫీసులో ఇటీవల నల్లుల బెడద పెరిగిపోయిందని, వాటిని నిర్మూలించేందుకు ఆఫీసును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 19న ఆఫీసును మూసివేసి నల్లుల నివారణకు చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ఆయా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతినిచ్చింది.ఉద్యోగులలో ఎవరికైనా దురద లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని కంపెనీ తన మెయిల్ చేసింది. పనిచేసే ప్రాంతంలో ఎక్కడైనా నల్లులు కనిపిస్తే తెలపాలని పేర్కొంది. ఆఫీసులో పెద్ద సంఖ్యలో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే నల్లులు వ్యాపించి ఉండవచ్చని కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా, 2010లో కూడా ఇదేవిధంగా నల్లుల బెడదతో గూగుల్ ఆఫీసు తాత్కాలికంగా మూతపడింది.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం… దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం

36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం
ఏపీకి భారీ వర్ష సూచన
పిడుగులు, బలమైన ఈదురుగాలుల హెచ్చరిక
సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది కేంద్రీకృతమైందని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 36 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన హెచ్చరించారు. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భూమనకు తిరుపతి పోలీసుల నోటీసులు

తిరుపతి గోశాలలో గోవుల మృతి ఆరోపణలపై విచారణ

వెంటనే హాజరు కావాలని వర్సిటీ పోలీసుల ఆదేశం
అధికారుల నిర్లక్ష్యం వల్లే మరణాలని గతంలో భూమన విమర్శ

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు.గోవుల మృతి ఘటనపై భూమన చేసిన ఆరోపణల నేపథ్యంలో, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు సహకరించాలని తిరుపతి వర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని గోశాలపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందాయని ఆయన విమర్శించారు. వాటికి సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. భూమన చేసిన ఆరోపణలు స్థానికంగా రాజకీయ దుమారం రేపడంతో, పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.