Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌
న్యూదిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆర్థిక వృద్ధి రేటును నమోదుచేస్తుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ వాతావరణం కూడా ఆశాజనకంగా ఉందని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధి 2020-21లో క్షీణించిన సంగతి తెలిసిందే. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధమైందని, రాష్ట్రాలు కూడా రెండు దశల నుండి గుణపాఠాలు నేర్చుకున్నాయని అన్నారు. కరోనా రెండు దశలనూ అధిగమించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో అర్థభాగంలోకి ప్రవేశించామని, ఆర్థిక కార్యకలపాలు పుంజుకుంటున్నాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా కోలుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ అంచనాలను దిగువకు సవరించిన సంస్థలు ఇక ఎగువకు సవరించవలసి రావచ్చని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు రెండు అంకెల్లో ఉంటుందని నేను అంచనా వేస్తున్నానని అన్నారు. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతానికి కుదించింది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ భారత్‌ జిడిపి వృద్ధి రేటును 11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. ఫిచ్‌ రేటింగ్స్‌ అంతకుముందు జీడీపీ వృద్ధి రేటు 12.8 శాతం అని పేర్కొన్నప్పటికీ.. తాజాగా సవరించి 10 శాతానికి తగ్గించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిని 9.5 శాతంగా నమోదు చేసిందని, దీంతో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోనుందన్న సూచనను అందించిందని అన్నారు. ప్రైవేట్‌ పెట్టుబడులు ఎప్పుడు పుంజుకుంటాయన్న ప్రశ్నకు స్పందిస్తూ స్టీల్‌, సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లో సామర్థ్య విస్తరణ కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img