Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.16 లక్షల కోట్లు

జులైలో 33 శాతం అధిక ఆదాయం

న్యూదిల్లీ : జులై నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం రూ.1.16 లక్షల కోట్లకు పైగా ఉంది. 2020, జులై పోలిస్తే ఈ వసూళ్లు 33 శాతం అధికం. ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడాన్ని ఇది సూచిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. జులై, 2020లో జీఎస్‌టీ రూ.87,422 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌లో ఈ వసూళ్లు రూ.92,849గా ఉన్నాయి. ఈ ఏడాది జులై నెలలో జీఎస్‌టీ ద్వారా రూ.1,16,393 కోట్ల ఆదాయం సమకూరింది. జులై జీఎస్‌టీ వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.22,197 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.28,541 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.57,864 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.27,900 కోట్లతో సహా), అలాగే సెస్‌లు రూ.7,790 కోట్లు(దిగుమతి వస్తువులపై రూ.815 కోట్లతో సహా) ఉన్నాయి. జులై నెలలో దిగుమతి వస్తువులపై ఆదాయాలు 36 శాతం అధికం. దేశీయ లావాదేవీల నుండి సేకరణ (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 32 శాతం ఎక్కువ. ‘జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలు రూ.లక్ష కోట్లకు పైగా నమోదయిన తర్వాత జూన్‌, 2021లో లక్ష కోట్ల దిగువకు పడిపోయాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మే, 2021లో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తిగా లేదా పాక్షికంగా కొవిడ్‌ లాక్‌డౌన్‌ అమలు చేశాయని వివరించింది. ‘కొవిడ్‌ ఆంక్షలను సడలిం చడంతో జులై, 2021కు జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్లు దాటాయి. ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడాన్ని ఇది సూచిస్తుంది. రాబోయే నెలల్లో కూడా జీఎస్‌టీ వసూళ్లు ఇదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది’ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img