Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ద్రవ్యోల్బణం వ్యత్యాసాలకు కారణాలు అనేకం…

జాతీయ సగటుకు మించి తెలుగు రాష్ట్రాలలో నమోదు

న్యూదిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు అయినాగానీ భారత్‌లో రీటైల్‌ ద్రవ్యోల్బణం, స్థానిక పన్నులు, సరఫరా చెయిన్ల సామర్థ్యంలో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ప్రభావితం అవుతుంది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూన్‌లో తెలంగాణలో 10.5శాతం కాగా బీహార్‌లో కనిష్ఠంగా 4.7శాతంగా ఉంది. జాతీయ సగటు ఏడు శాతంగా ఉంది. రవాణా ఖర్చులు, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, సరఫరా చెయిన్ల సామర్థ్యం వంటివి ద్రవ్యోల్బణంలో వ్యత్యాసానికి కారణాలని నిపుణులు అంటున్నారు. సీపీఐ తాజా డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఎనిమిది శాతానికి మించి ద్రవ్యోల్బణం రేటు ఉండగా జాతీయ సగటుకంటే ఎక్కువగా రీటైల్‌ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన రాష్ట్రాలలో అసోం, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో 7.2శాతం నమోదు అయింది. ఇక ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటక, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా రీటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు అయింది. తమిళనాడు, దిల్లీ, హిమచల్‌ ప్రదేశ్‌, కేరళలో ఆరు శాతం కంటే తక్కువగా ఉంది. రవాణా ఖర్చులో 4060శాతం డీజిల్‌పైనే ఉంటుందని, దీని ప్రభావం నేరుగా వినియోగ వస్తువులపై పడుతుందని అఖిలభారత సరకు రవాణా వాహన యజమానుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజిందర్‌ సింగ్‌ అన్నారు. కూరగాయల వంటివాటి రవాణాకు రానుపోను చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, దూర ప్రయాణాలకైతే ఒకవైపు ఖర్చు ఇవ్వాలని చెప్పారు. వెళ్లే మార్గంలో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉంటే ఖర్చు అంతేస్థాయిలో పెరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్థానిక పన్నులు ఎక్కువ కాబట్టి డీజిల్‌ ధర అధికంగానే ఉంటుంది. అంతర్రాష్ట్ర వైవిధ్యత అన్నది రాష్ట్రాల ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుందని పారిశ్రామిక సంస్థ పీహెచ్‌డీసీసీఐ ప్రధాన ఆర్థికవేత్త ఎస్పీ శర్మ అన్నారు. గ్రామీణ ద్రవ్యోల్బణం అనేక రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుందని, సాధారణంగా పట్టణాల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇంధన సుంకాల కారణంగా పెట్రోలియం ఉత్పత్తులు కొన్ని రాష్ట్రాల్లో అధికంగా ఉండటంతో వీటి ప్రభావం మిగతా వస్తువుల ధరలపై ఉంటుందని తెలిపారు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) నెలసరి సీపీఐ డేటాను విడుదల చేస్తుంది. ఎంపిక చేసిన 1,114 పట్టఠణ మార్కెట్లు, 1,181 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఫీల్డ్‌ ఆపరేషన్ల ద్వారా ధరల సూచీ రూపొందిస్తుంది. గ్రామీణ భాతర ఎన్జీవోల సమాఖ్య (సీఎన్‌ఆర్‌ఐ) ప్రధాన కార్యదర్శి బినోద్‌ ఆనంద్‌ ఇటీవల ఎంఎస్‌పీ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఈయన మాట్లాడుతూ, ద్రవ్యోల్బణంలో వ్యత్యాసం జీవన వ్యయం వల్ల కూడా ప్రభావితం అవుతుందని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా అనేక వస్తువులను అందిస్తున్న క్రమంలో రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమై డిమాండు పెరుగుతుండం కూడా రాష్ట్రాల మధ్య మార్పునకు దారితీసినట్లు చెప్పారు. కాగా, తెలంగాణ, మహారాష్ట్రలో 20.96, 17.58శాతం లెక్కన జూన్‌ ద్రవ్యోల్బణం నమోదు అయింది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో విద్యుత్‌ వ్యయం కూడా ఎక్కువ. రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణ రేట్లు మారడానికి అనేక అంశాలు దోహదమవుతాయని బెంగళూరులోని ఎన్‌ఎంఐఎంఎస్‌కు చెందిన సీనియర్‌ ప్రొఫెసర్‌ (ఎకనామిక్స్‌) శశి శివరామకృష్ణ అన్నారు. ఆహారం, ధాన్యం, పప్పులు, వంటనూనెల ధరల్లో మార్పకు రాష్ట్ర స్థాయి విధానాలు, ఆహార వ్యయం కారణాలని చెప్పారు. ద్రవ్యోల్బణం అన్నది మార్కెట్‌లో రాపిడికి ఫలితమని, రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణ రేట్లలో వ్యత్యాసం సహజమేనని, ఇందుకు అవి అనుసరించే విధానాలే కొంత కారణమని ఆయన చెప్పారు. మొత్తం 17 కేంద్రరాష్ట్ర పన్నులను విలీనం చేసి ఒకటే పన్నుగా జీఎస్టీని అమలు చేయడం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img