Friday, January 16, 2026
Homeసంపాదకీయంనిజం చెప్పే మీడియాపై కేసులు

నిజం చెప్పే మీడియాపై కేసులు

- Advertisement -

ప్రసిద్ధ పత్రికా రచయిత బీహార్‌లో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టినందుకు ఆయన మీద ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ఓటర్లకు రెండు ఫారాలు ఇవ్వవలసి ఉండగా ఒకటే ఫారం ఇస్తున్నారన్న వాస్తవాన్ని బయట పెట్టినందుకే ఎఫ్‌ఐఆర్‌. దాఖలైందనుకోవాలేమో! ఎన్నికల కమిషన్‌ ప్రధానమంత్రి మోదీ సైగలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలు పెట్టి చాలా కాలమే అయింది. అధికారం నిలబెట్టు కోవడం కోసం, ప్రతిపక్షాలను అణచివేయడం కోసం మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సకల వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేసిందో చెప్పక్కర్లేదు. బీహార్‌ ఎన్నికలలో ఎన్డీయేను మోదీ గెలిపించకపోతే ఆయన పదవికే ముప్పు ఎదురుకావొచ్చు. 75 ఏళ్లు నిండిన వారు పదవులనుంచి తప్పుకోవాలని అన్యాపదేశంగా చెప్పి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ అంతర్గత కలహాల గుట్టు విప్పారు. అందుకని ఏదో ఒక మాయ చేసి ఎన్నికలలో గెలవడానికి మోదీ సర్కారు పన్నవలసిన కుట్రలన్నీ పన్నుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు రొహింగ్యాలు బీహార్‌ ఓటర్ల జాబితాలో ఉన్నారని ఎన్నికల కమిషన్‌ ఇప్పుడు యాగీ చేస్తోంది. కానీ గత పదేళ్ల కాలంలో కనీసం బీహార్‌ శాసనసభ ఎన్నికలు రెండు సార్లు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలూ జరిగాయి. మరి అప్పటి ఎన్నికలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అక్రమ ఓటర్ల మద్దతుతోనే ఎన్నికైనట్టేనా? ఓటర్ల జాబితా సవరణ, లేదా కొత్త జాబితా తయారీ పేరుతో ఏం జరుగుతోందో పరిశీలించి ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత మీడియా ప్రతినిధులపై ఉంది. యూట్యూబర్‌ అజిత్‌ అంజుం సరిగ్గా అదే పని చేశారు. ఆయన కొద్ది రోజులుగా బీహార్‌ లో మూల మూలలా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓటర్లకు రెండు ఫారాలు ఇవ్వవలసి ఉండగా ఒకే ఫారం ఇచ్చిన అంశాన్ని బయట పెట్టారు. ప్రజల మనోభావాలను, భయాలను ఎన్నికల కమిషన్‌కు తెలిసేలా చేయడం అపరాధం ఎలా అవుతుందో! మీడియాలో వచ్చిన వార్తా విశేషాలలో అక్రమాల ప్రస్తావన చేస్తే వాటి మీద విచారణ జరిపించి నిజానిజాలు తెలియజేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ మీద ఉంటుంది. దానికి బదులు జరుగుతున్న అవకతవకలను బయట పెట్టిన మీడియా ప్రతినిధి మీదే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం అంటే ఎన్నికల కమిషన్‌ వెనక ఉన్న హస్తం ఏదో తెలుస్తూనే ఉంది. బీజేపీలో ఓటమి భయం ఎంతగా గూడుకట్టుకుందో అర్థమవుతోంది. తప్పుదోవలో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫారాలు ఎలా పోగుపడుతున్నాయో అజిత్‌ అంజుం సచిత్రంగా నిరూపించారు. ఇంతకు ముందు అవకతవ కలను, అక్రమాలను, వాస్తవాలను మీడియా బయటపెడ్తే ఎన్నికల కమిషన్‌ సంతోషించేది. దిద్దుబాటు చర్యలు చేపట్టేది. అజిత్‌ అంజుం అందించిన వార్తను వాస్తవాలను నివేదించడంలా కాకుండా తమకు వ్యతిరేకమైందిగా ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. పోలింగ్‌ కేంద్ర స్థాయి అధికారులు ఓటర్లకు రెండేసి ఫారాలు ఇవ్వవలసి ఉంది. కానీ చాలా వరకు అలా జరగడం లేదు. ఈ అధికారులు తమంత తాము ఒకే ఫారం ఇవ్వాలని నిర్ణయించే అవకాశమే లేదు. దీని వెనకాల బలమైన హస్తం ఉండి ఉంటుంది. అజిత్‌ అంజుం వెల్లడిరచిన వాస్తవాలు ఈ సంకేతాలే ఇచ్చాయి. ఎన్నికల కమిషన్‌ దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడం మానేసి కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల మాన రక్షణ కోసం నానా యాతన పడ్తోంది. అజిత్‌ అంజుం యూట్యూబ్‌లో పెట్టిన వీడియోను తొలగించాలని బ్లాక్‌ డెవలప్‌మెంటు అధికారి, ఎస్‌డీఓ ఫోన్‌ చేసి ఆదేశిం చారట. అసలు ఆ అధికారం వారికి ఉందా. ఒక వేళ అజిత్‌ అంజుం చేసింది తప్పే అనుకున్నా ఏ స్థాయి అధికారులు చర్య తీసుకోవాలి?
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ లేదా తయారీపై వందలాది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పకుండా, వివరణ ఇవ్వకుండా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయిస్తోందంటే ప్రజాస్వామ్యానికి మూలకందమైన ఎన్నికల ప్రక్రియను సవ్యంగా నిర్వర్తించవలసిన బాధ్యతను ఎలా గాలికి వదిలేస్తోందో అర్థం అవుతోంది. పైగా తమను ఆ స్థానాల్లో కూర్చోబెట్టిన రాజకీయ పార్టీకి ఊడిగం చేసి ఎలా తరించి పోతోందో తెలుస్తూనే ఉంది. యూట్యూబ్‌ కేవలం ఒక ప్రసార మాధ్యమం మాత్రమే. అజిత్‌ అంజుం కేవలం ఆ మాధ్యమ ప్రతినిధే. పైగా అజిత్‌ అంజుంను ఎన్నికల కమిషన్‌ మీడియా ప్రతినిధిగా పరిగణించడం లేదు. కేవలం యూట్యూబర్‌గానే చూస్తోంది. కాని ఆయన యూట్యూబ్‌ ద్వారా మీడియాలో తన పాత్ర పోషిస్తున్నారు. యూట్యూబ్‌ ఆధునిక మీడియా వేదికల్లో ముఖ్యమైంది. పోలింగ్‌ కేంద్ర స్థాయి అధికారి ఈ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది. జిల్లా స్థాయి అధికారి అజిత్‌ అంజుం నివేదిక భ్రమలు గొల్పేదిగా ఉందన్నారు తప్ప ఆయనే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదు. అజిత్‌ అంజుం ఓటర్ల జాబితా సవరణలో నిమగ్నమైన సిబ్బందిని కలుసుకుని రెండు ఫారాలకు బదులుగా ఒక్క ఫారమే ఇస్తున్నారన్న అసలు విషయాన్ని బయట పెట్టారు. పత్రికా రచయిత సమాచారం ఎక్కడి నుంచి సేకరించారు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. కోర్టు అడిగినప్పుడు మాత్రమే ఈ విషయం బయట పెట్టవలసి వస్తుంది. అజిత్‌ అంజుం బయటపెట్టిన అంశాల గురించి మాట్లాడకుండా ఆయన ఓటర్ల జాబితా సిద్ధం చేయడంలో నిమగ్నమైనవారి పనికి ఆటంకం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అధికారుల పనికి అడ్డుతగలడం తప్పే కానీ సమాచారం సేకరించడం తప్పెలా అవుతుంది? పోలింగ్‌ కేంద్ర అధికారి ఓటర్లకు రెండు ఫారాలకు బదులుగా ఒకే ఫారం ఎందుకిచ్చారు అన్న ప్రశ్నకు అనుమాన రహితంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ మీదే ఉంటుంది. అజిత్‌ అంజుం తన వీడియోలో చూపించిన అంశాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదు. దైనిక్‌ భాస్కర్‌ విలేకరులు అజిత్‌ అంజుం లేవనెత్తిన ప్రశ్నలనే పదే పదే లేవనెత్తుతున్నారు. వారందరి మీదా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తారుగా. ఎన్నికల కమిషన్‌ తర్కం ప్రకారమైతే ఆ పని చేయాలి. కానీ ఎన్నికల కమిషన్‌ తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనుకునే వారి మీద చర్య తీసుకోవడానికి సిద్ధపడ్తోంది. అజిత్‌ అంజుం మత చిచ్చును రెచ్చగొట్టే పని చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. రెండో ఫారం ఇవ్వడం లేదు అని అజిత్‌ అంజుం బయటపెట్టడం చాలా కీలకమైంది. తమకు రెండు ఫారాలు ఇవ్వవలసి ఉంది అని తెలియని ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని చైతన్యవంతులను చేయడంలో అజిత్‌ అంజుం మహత్తరపాత్ర పోషించినందుకు నిజానికి సంతోషించాలి. అలా కాకుండా శిక్షిస్తామంటున్నారు. రాజకీయ యజమానుల ప్రయోజనాలు కాపాడడమే పరమావధి అనుకునే వారు ఇంతకన్నా ఎం చేయగలరుగనక!

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు