Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నేడు, రేపు దిల్లీలో ధర్నాను జయప్రదం చేయండి

32 మంది ప్రాణత్యాగానికి ప్రతీక విశాఖ ఉక్కు
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు
ఉక్కు లీగల్‌ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌

తిరుపతి : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నేడు, రేపు దిల్లీలో జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఆదివారం చిత్తూరు జిల్లా నుండి దిల్లీకి బయలుదేరిన ఏఐటీయూసీ కార్యకర్తల చలో దిల్లీ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జి.ఓబులేసు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగుతోందని, ఇప్పటికే మూడుసార్లు బంద్‌ నిర్వహించినట్లు తెలిపారు. 32 మంది ప్రాణత్యాగానికి ప్రతీక విశాఖ ఉక్కు పరిశ్రమ అని అన్నారు. విశాఖ ఉక్కు లీగల్‌ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడం దారుణమని, కార్పొరేట్‌ శక్తులకు అమ్ముకోవడానికి కర్మాగారం నష్టాలలో నడుస్తోందంటూ తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ, పార్లమెంటు, కౌన్సిల్‌లో తీర్మానాలు లెక్కలేవా అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళుతోందని అన్నారు. ప్రైవేటీకరణ చర్యలను నిలుపుదల చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని హెచ్చరించారు. తిరుపతి నుండి దిల్లీకి వెళ్లిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మురళి, జిల్లా సహాయ కార్యదర్శి కె.రాధాకృష్ణ, సీపీఐ నగర కార్యదర్శి జె.విశ్వనాథం, ఎన్‌.డి.రవి, వై.యస్‌.మని ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర్‌ ప్రధాన కార్యదర్శి కె.వై.రాజా, రామకృష్ణ, మహేంద్ర, రాజశేఖర్‌, ప్రమీల, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img