Monday, June 5, 2023
Monday, June 5, 2023

తొలిపాట రాసిన చోటుకు ఆస్కార్‌

హైదరాబాద్‌: సుమారు 28 ఏళ్ల క్రితం తాను ఎక్కడైతే (రామానాయుడు స్టూడియోస్‌) తొలి పాటను రాశారో అక్కడికి ‘ఆస్కార్‌’ ను తీసుకెళ్లి ఆనందం వ్యక్తం చేశారు సినీ గేయ రచయిత చంద్రబోస్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఆయన రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఆ వేడుకకు హాజరైన ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రచయితగా తనను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడిని గుర్తుచేసుకుంటూ ఆయన రామానాయుడు స్టూడియోస్‌కు వెళ్లారు. అక్కడ రామానాయుడు తనయుడు, నిర్మాత సురేశ్‌బాబుని కలిసి నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైన నా ప్రయాణం ఆస్కార్‌ వరకూ వెళ్లిందంటూ సంతోషాన్ని పంచుకున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తనకెంతో ప్రత్యేకమని తెలిపారు. రామానాయుడు ఆశీస్సులు తనపై ఉంటాయని అభిప్రాయపడ్డారు. 1995లో వచ్చిన ‘తాజ్‌మహల్‌’తో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు చంద్రబోస్‌. అందులో ఆయన రాసిన ‘మంచు కొండల్లోన చంద్రమా’ గీతం సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాట ప్రయాణం గురించి చెబుతూ చంద్రబోస్‌ 28 ఏళ్లు వెనక్కి వెళ్లారు. శ్రీకాంత్‌, సంఘవి, మోనికా బేడీ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించారు. చంద్రబోస్‌ ఇన్నేళ్లలో ఎన్నో పాటలతో ఉర్రూతలూగించారు, కొన్నింటితో స్ఫూర్తినింపారు. ఎన్నో పద ప్రయోగాలు సృష్టించి, మెప్పించారు. ఇప్పుడు.. ఆస్కార్‌ పొందిన తొలి తెలుగు గేయ రచయితగా నిలిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img