హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభమైంది. ఆయన కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం శనివారం హౖదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతోపాటు పలువురు టాలీవుడ్ దర్శకులు హాజరై అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, వి.వి.వినాయక్, బుచ్చిబాబు, బాబీతోపాటు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలయ్య 107వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. పక్కా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య ఫుల్ యంగ్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు జోడీగా నటి శ్రుతిహాసన్ సందడి చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మరోవైపు ఇటీవల విడుదలైన ‘క్రాక్’ చిత్రంతో గోపీచంద్ మలినేని సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్నారు. ఇక, బాలయ్య ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు.