హైదరాబాద్: తెలుగు సినీ తెరపై ఒక్కసారి కమెడియన్ బ్రహ్మానందం అలా కనిపిస్తే చాలు, స్టార్ నటీనటులకు ధీటుగా ఆయన సీన్స్‌కు రెస్పాన్స్ వస్తుంటుంది. ఆ విధంగా మొదటి నుండి తెలుగు ప్రేక్షకులని తనదైన హాస్య పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. అయితే తన కెరీర్‌లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ప్రతీ ఒక్క ఆడియెన్ కంటతడి పెట్టేసుకుంటారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. బ్రహ్మానందంకి శాలువాతో సత్కరించారు.