హైదరాబాద్: ‘మహానటి’, ‘సీతా రామం’ సినిమాలతో తెలుగు వారికి బాగా చేరువయ్యారు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి కుమారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి కొన్నిరోజులకే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలామంది స్టార్ హీరోల కుమారులు 20 ఏళ్లకే పరిశ్రమలో అడుగు పెట్టినా.. దుల్కర్ మాత్రం 28 ఏళ్లకు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. తాను ఎందుకు ఆలస్యంగా రావాల్సి వచ్చిందో తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు. ‘‘నేను ఈ రంగంలోకి రావడానికి మొదట చాలా భయపడ్డాను. అందుకే 28 ఏళ్లు వచ్చే వరకు ఆగాను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ నేను నటించగలనా.. థియేటర్లో ప్రేక్షకులు నన్ను రెండు గంటలు చూడగలరా అని అనుకున్నా. ఆ వయసులో మనపై మనకు పెద్దగా నమ్మకం ఉండదు. ఎంతో అభద్రతా భావానికి లోనవుతుంటాం. నా పరిస్థతి కూడా అదే. పైగా అప్పుడు మలయాళ చిత్రపరిశ్రమలో నెపోటిజం బాగా చర్చనీయాంశమైన విషయం. మా నాన్న ఈ రంగంలో లెజెండ్. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన పేరును నేను చెడగొడతానేమోనని భయపడ్డాను. కానీ, ఇప్పుడు సినిమానే నా జీవితమైపోయింది. నాపై సినీ రంగ అంతగా ప్రభావం చూపింది. అది నా ప్రపంచంగా మారిపోయింది’’ అని దుల్కర్ తెలిపారు.
దుల్కర్ తెలుగు, హిందీలతో పాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుని ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన సొంత బ్యానర్‌లో ‘కింగ్ ఆఫ్ కొట’ అనే సినిమాలో నటిస్తున్నారు.