Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కృష్ణ చేతుల మీదుగా ‘జై విఠలాచార్య’ ఫస్ట్‌ లుక్‌

హైదరాబాద్‌ : తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణా ధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత్ర ఆయనది. ఆయన ఎవరితో సినిమాలు చేసినా ఆ సినిమా లన్నీ విఠలాచార్య సినిమాలుగానే గుర్తింపు పొందాయి. దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన సినీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్‌, నంది అవార్డ్‌ గ్రహీత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఆ సమగ్ర పుస్తకానికి ‘జై విఠలాచార్య’ అని పేరు పెట్టారు.
‘మూవీ వాల్యూమ్‌’ షేక్‌ జిలాన్‌ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. శుక్రవారం సూపర్‌స్టార్‌ కృష్ణ ఈ పుస్తకం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘విఠలాచార్య దర్శకత్వంలో ‘ఇద్దరు మొనగాళ్లు’ సినిమా చేశా. ఆ సినిమా హిట్‌ అయ్యింది. నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో ఆయన సినిమాలు చాలా చూశాను. కాంతారావు హీరోగా ఆయన చాలా జానపద సినిమాలు చేశారు. నేను ఎక్కువగా యాక్షన్‌ సినిమాలు చేశా. ‘ఇద్దరు మొనగాళ్లు’ కాకుండా ‘మహాబలుడు’, ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘సింహాసనం’ సినిమాలు చేశాను. ‘గూఢచారి 116’ విడుదలైన 40 రోజులకు అనుకుంటా… ‘ఇద్దరు మొనగాళ్లు’ ఓకే చేశా. నేను చేసిన ఫస్ట్‌ మల్టీస్టారర్‌ కూడా ఇదే. విఠలాచార్య గారు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే, సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా ఎన్నో హిట్‌ సినిమాలు చేశారు. అనుకున్న బడ్జెట్‌లో చాలా వేగంగా సినిమాలు తీసేవారు. ఆయనపై పుస్తకం తీసుకువస్తుండటం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. షేక్‌ జిలాన్‌ బాషా మాట్లాడుతూ ‘‘నేను పదమూడేళ్లుగా సినిమా జర్నలిస్టుగా ఉన్నాను. మూడు నందులు అందుకున్న సక్సెస్‌ ఫుల్‌ రైటర్‌ పులగం చిన్నారాయణ. ఆయన రాసిన తొమ్మిదో పుస్తకం ‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్‌లో ‘జై విఠలాచార్య’ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img