Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రముఖ ఎడిటర్‌ కృష్ణారావు కన్నుమూత


హైదరాబాద్‌: ప్రముఖ ఎడిటర్‌, నిర్మాత జి.జి కృష్ణారావు (87) కన్నుమూశారు. మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. జీజీ కృష్ణారావు వివిధ భాషల్లో సుమారు 200కు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తెలుగులో కళాతపస్వి కె.విశ్వనాథ్‌, దాసరి నారాయణరావు, బాపు, జంధ్యాల వంటి దిగ్గజ దర్శకుల సినిమాలకు ఆయన సేవలందించారు. కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘శంకరా భరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘శుభలేఖ’ వంటి సినిమాలతో పాటు శృతి లయలు, సిరివెన్నెల, శుభ సంకల్పం, స్వరాభిషేకం వంటి హిట్‌ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్‌ పాపారాయుడు’ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా సేవలందించారు. 1981లో కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘సప్తపది’కి ఉత్తమ ఎడిటర్‌గా కృష్ణరావు నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా నుంచి ఎడిటర్‌ విభాగంలో నంది అవార్డు ఇవ్వడం మొదలు పెట్టారు. అనంతరం ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ చిత్రాలకు కృష్ణారావు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కళాతపస్వి విశ్వనాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కినవి కావడం విశేషం. ‘మిలన్‌’, ‘ఈశ్వర్‌’, ‘సుర్‌ సంగమ్‌’, ‘జ్వర్‌ భట’ 1973, ‘మస్తానా’ 1970 వంటి సూపర్‌ హిట్‌ హిందీ సినిమాలతో పాటు.. ‘ఎజుమలైయన్‌ మహిమై’ 1997, ‘సలంగై ఓలి’ 1983 వంటి అనేక తమిళ సినిమాలకు ఎడిటర్‌ గా పనిచేశారు. గుడివాడ ఎ.ఎన్‌.ఆర్‌. కాలేజీలో ఎమ్మెస్సీ చేసిన జి.జి. కృష్ణారావు మొదట ఆర్మీలో చేరాలని భావించారు. అనుకోకుండా పూనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో ఎడిటింగ్‌ కోర్సులో చేరారు. 1961-62లో ఎడిటింగ్‌ కోర్సు చేస్తున్న సమయంలో ప్రముఖ దర్శకులు, ఎడిటర్‌ ఆదుర్తి సుబ్బారావుగారి దృష్టిలో పడ్డారు. ఆలా చెన్నైలో అడుగు పెట్టిన కృష్ణారావు… ‘పాడవోయి భారతీయుడా’తో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు ఎడిటర్‌గా చేశారు. కృష్ణారావు మృతికి అనేకమంది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img