హైదరాబాద్: పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్ పెద్ద అభిమానే కాదు.. భక్తుడు కూడా. పవన్‌కల్యాణ్ పేరు చెబితేనే పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. వేదిక దొరికిన ప్రతిసారి పవన్‌పై తనకున్న భక్తిని తెలియజేస్తుంటాడు బండ్ల గణేశ్. తాజాగా ఆసక్తికర ట్వీట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. గురువారం ఆయన పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి ‘మీకు తిరుగులేదు దేవర’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అసలు ట్వీట్‌కి కారణం ఏంటంటే.. పవన్‌కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురించి. తాజాగా షెడ్యూల్ కోసం పవన్ సెట్లో అడుగుపెట్టారు. చారిత్రక కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో యాక్షన్ సీన్స్ కోసం పవన్ రిహార్సెల్ చేస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్‌తో కలిసి కొన్ని పోరాట సన్నివేశాలు ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఆ ఫొటోలను బండ్ల గణేశ్ ట్విట్టర్లో షేర్ చేసి ‘‘గన్ను పట్టినా, పెన్ను పట్టినా, కత్తి పట్టినా, మైకు పట్టినా.. ఏది పట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవర’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.