హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో అనేక చిత్రాలు నిర్మించిన ఒకప్పటి నిర్మాత గోగినేని ప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ వంటి చిత్రాలతో పాటు నందమూరి బాలకృష్ణతో ‘పల్నాటి పులి’ సినిమాని రూపొందించారు. వయోభారం కారణంగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 73 ఏళ్ల వయసున్న గోగినేని ప్రసాద్… బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కొండాపూర్ తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారు వెల్లడిరచారు. టాలీవుడ్ నిర్మాత గోగినేని ప్రసాద్ కు ఓ కుమారుడు ఉన్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో స్థిర పడ్డారు. గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రసాద్ అంత్యక్రియలను నిర్వహించారు. నిర్మాత గోగినేని ప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సోదరి అనారోగ్యం కారణంగా మృతి చెందగా.. అంతకు ముందు ‘జైలర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు, దర్శకుడు జి.మారి ముత్తు కన్నుమూశారు. ఇలాంటి వరుస విషాదాలతో సినీ పరిశ్రమ కోలుకోక ముందే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత కన్నుమూశారు.