Homeతెలంగాణస్టాప్ ఎక్కడా.. ఆపిందెక్కడా ?

స్టాప్ ఎక్కడా.. ఆపిందెక్కడా ?

- Advertisement -

మొయినాబాద్ ప్రధాన చౌరస్తాలో ప్రయాణికుల ఇక్కట్లు
– కనిపించని సిగ్నళ్లు, పోలీసులు చలాన్లకే పరిమితం
విశాలాంధ్ర , మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం కొన్నిసార్లు నీరుగారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజల అవసరాలకు ఉన్న రవాణా కాస్తా.. కొందరి నిర్వాకం వల్ల సామాన్యులు తిప్పలు పడాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్సులు వచ్చేవే అంతంత మాత్రం.. ఆపై బస్టాప్ ఉన్నచోట కాకుండా డిస్టిక్ సర్వీసులను డ్రైవర్లు ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా ఉన్నచోట నిలుపుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిటీ సర్వీసులున్నా.. సమయ పాలన ముఖ్యం..
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో చాలా ఏళ్ల క్రితమే అన్ని రకాల బస్సులకు స్టాప్ ఉంది. కానీ అప్పట్లోనే తాండూరు, పరిగి, వికారాబాద్, నారాయణపేట్ తదితర బస్సు సర్వీసులన్నీ స్టేజీ వద్దే ఆగేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెరిగిన రద్దీ పేరుతో సదరు బస్సు డ్రైవర్లు ‘ మీకు సిటీ సర్వీసులన్నాయి.. కదా.. ఈ బస్సులెందుకని..’? ప్రయాణికులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేవలం బస్సు సర్వీసులపై ఆధారపడి మెహీదిపట్నం లేదా ఎంజీబీఎస్కు ఉదయాన్నే వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్టేజీ ఉన్నది ఒకచోటైతే ఏకంగా దాదాపు 200 మీటర్ల దూరంలో నిలిపితే.. వద్ధులు, మహిళలు, దిగేది ఎట్లా.. ? వారిని తీసుకెళ్లేందుకు వచ్చే వారు ఎలా రావాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇష్టానుసారంగా పార్కింగ్..
బస్టాప్ వద్ద ఇష్టానుసారంగా వాహనాల పార్కింగ్తో పాటు ఆటోలు ఉండటంతో నిలిపే కొద్దిపాటి బస్సులకు కూడా ఇబ్బంది కలుగుతోంది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
దిగేవారుంటే స్టాప్ లేకున్నా ఓకే..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం స్టాప్ లేకున్నా.. ముందస్తు స్టేజ్ టిక్కెట్తో బస్సులు నిలిపినప్పుడు ఎన్నో ఏళ్లుగా ఉన్న బస్టాప్లో బస్సు నిలపకపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రధాన చౌరస్తాలో సిగ్నలేది..?
వాహనాల రద్దీతో మొయినాబాద్ ప్రధాన చౌరస్తాలో సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. దీంతో ప్రమాదాల పాలవుతున్నారు. ఉదయం లేబర్ అడ్డాతో రోడ్డుపైనే జనం నిలబడటంతో మరింత కష్టంగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం చలాన్లకే పరిమితం..
ట్రాఫిక్ను క్రమబద్దీకరించాల్సిన పోలీసులు మాత్రం కేవలం సామన్యుడి నడ్డి విరిచేందుకు చలాన్ల మోత మోగిస్తున్నారు. చలాన్లకే పరిమితం కాకుండా ట్రాపిక్కు అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు